ద్విశతకాల్లో కేన్ మామ సిక్సర్.. సెహ్వాగ్, సచిన్ రికార్డు సమం
టెస్టుల్లో కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆరో డబుల్ సెంచరీ చేశాడు. తద్వారా దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్నాడు
By తోట వంశీ కుమార్ Published on 18 March 2023 2:45 PM ISTకేన్ విలియమ్సన్, సెహ్వాగ్, సచిన్
సొంతగడ్డపై న్యూజిలాండ్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును ఆఖరి బంతికి గెలిచిన కివీస్ రెండో టెస్టులో భారీ స్కోర్ చేసింది. కివీస్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్(296 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్స్‌లతో 215), హెన్రీ నికోల్స్(240 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 200 నాటౌట్) ద్విశతకాలు బాదడంతో తొలి ఇన్నింగ్స్‌ను 580/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇద్దరితో పాటు ఓపెనర్ డెవాన్ కాన్వే( 78) అర్థశతకంతో రాణించాడు. లంక బౌలర్లలో కసున్ రజితా రెండు వికెట్లు పడగొట్టగా.. ధనుంజయ డిసిల్వా, ప్రబత్ జయసూర్య చెరో వికెట్ తీశారు.
కేన్ మామ డబుల్ సిక్సర్..
ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన కేన్ విలియమ్సన్ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కేన్ మామ కెరీర్‌లో ఇది ఆరో డబుల్ సెంచరీ. ఈ క్రమంలో రాహుల్ ద్రావిడ్(5), జో రూట్(5) అధిగమించి సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఆటపట్టు, జావెద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్‌ల రికార్డును కేన్ మామ సమం చేశాడు. ఈ జాబితాలో ఆసీస్ దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్‌మన్ 12 ద్విశతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్రాడ్‌మన్ కేవలం 52 మ్యాచుల్లోనే ఈ ఘనతను సాధించాడు.
రెండు వికెట్లు కోల్పోయిన లంక..
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లంక రెండో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. కరుణరత్నె 16, జయసూర్య 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. అవిశ్వ ఫెర్నాండో (6), కుశాల్ మెండీస్(0) లు విఫలం అయ్యారు. లంక జట్టు కివీస్ తొలి ఇన్నింగ్స్‌కు ఇంకా 554 పరుగుల వెనుకబడి ఉంది.