డిస్క‌స్ త్రో.. ఫైన‌ల్‌కు క్వాలిఫై అయిన క‌మ‌ల్‌ప్రీత్ కౌర్‌

Kamalpreet Kaur Qualifies for the finals of discus throw.టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త క్రీడాకారిణి క‌మ‌ల్ ప్రీత్ కౌర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 July 2021 10:28 AM IST
డిస్క‌స్ త్రో.. ఫైన‌ల్‌కు క్వాలిఫై అయిన క‌మ‌ల్‌ప్రీత్ కౌర్‌

టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త క్రీడాకారిణి క‌మ‌ల్ ప్రీత్ కౌర్ సంచ‌ల‌నం సృష్టించింది. మ‌హిళ‌ల డిస్క‌స్‌త్రో లో శ‌నివారం ఉద‌యం జ‌రిగిన క్వాలిఫికేష‌న్‌లో ఆమె 64 మీట‌ర్ల దూరం విసిరి.. ఫైన‌ల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. కమల్‌ప్రీత్‌ మూడో ప్రయత్నంలో సరిగ్గా 64 మీ విసిరి ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. మొత్తం మూడు రౌండ్లపాటు జరిగిన డిస్కస్‌త్రోలో కమల్‌ప్రీత్‌ తొలి రౌండ్‌లో 60.29, రెండో రౌండ్‌లో 63.97, మూడో రౌండ్‌లో 64 మీ విసరడం విశేషం.

మ‌రోవైపు భారీ అంచ‌నాలు పెట్టుకున్న సీమా పునియా 60.57 మీట‌ర్ల దూరమే విసిరి.. 16వ స్థానంలో నిలిచి నిరాశ‌గా వెనుదిరిగింది. ఇక అమెరికా క్రీడాకారిణి 66.42 మీట‌ర్ల‌తో అంద‌రి క‌న్నా ముందు అగ్ర‌స్థానంలో నిలిచింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇక్కడ ఎవ‌రైతే.. 64 మీట‌ర్లు సాధిస్తారో వారు నేరుగా తుదిపోరుకు అర్హ‌త సాధిస్తారు. అలాకాక‌పోతే.. అంద‌రిలో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన టాప్ 12 మందిని పైన‌ల్‌కు ఎంపిక చేస్తారు. పైన‌ల్ పోటీ ఆగ‌స్టు 2న జ‌ర‌గ‌నుంది. మొత్తం 12 మంది పోటిప‌డ‌తారు. ఫైన‌ల్‌లో కూడా క‌మ‌ల్ ప్రీత్ ఇలాంటి మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తే భార‌త్‌కు మ‌రో ప‌త‌కం ఖాయ‌మ‌నే చెప్పొచ్చు. కమల్‌ప్రీత్ ఈ ఏడాది ప్రారంభంలో 66.59 మీటర్ల ఉత్తమ త్రో తో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. ఇది 2021 లో ప్రపంచంలో 6 వ అత్యుత్తమ త్రో గా నిలిచింది.

Next Story