ఆ క్షణం నాలోకి డేవిడ్ వార్నర్ ప్రవేశించాడు : అశ్విన్

Just brought out the David Warner inside me says R Ashwin.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022 సీజ‌న్‌లో టీమ్ఇండియా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 May 2022 8:11 AM GMT
ఆ క్షణం నాలోకి డేవిడ్ వార్నర్ ప్రవేశించాడు : అశ్విన్

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022 సీజ‌న్‌లో టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ అద‌ర‌గొడుతున్నాడు. అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో స‌త్తాచాటుతూ ఆల్‌రౌండ‌ర్‌గా జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అశ్విన్‌ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడి 183 పరుగులతో పాటు 11 వికెట్లు తీశాడు. ఇక శుక్రవారం చెన్నైతో జ‌రిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో ప్ర‌మాద‌క‌ర డేవిడ్ కాన్వేను ఔట్ చేయ‌డంతో పాటు బ్యాటింగ్‌లో 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో రాజ‌స్థాన్‌కు అద్వితీయ విజ‌యాన్ని అందించాడు.

ఇక మ్యాచ్ అనంత‌రం అశ్విన్ మాట్లాడుతూ.. కీలక సమయంలో రాణించ‌డంతో సంతోషంగా ఉంద‌న్నాడు. ఒత్తిడిలో ఆడడం ఎప్పుడు ఇష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ సమయమే కదా మనలో ఉన్న ప్రతిభను భయటపెట్టేది. జైశ్వాల్‌ మంచి పునాది వేయగా, దానిని తాను కంటిన్యూ చేసిన‌ట్లు చెప్పాడు. ప్లేఆఫ్‌లోనూ ఇదే ప్రదర్శన చేసి ఫైనల్‌ చేరుకుంటాం. రాసిపెట్టుకోండి. ఈసారి కచ్చితంగా రాజస్తాన్‌ కప్‌ కొట్టబోతుంది అని అన్నాడు.

ఈ అద్భుత ఇన్నింగ్స్‌ను పక్కనపెడితే మైదానంలో అశ్విన్‌ చేసుకున్న సెలబ్రేషన్‌ను సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చివ‌రి ఓవ‌ర్‌లో రాజ‌స్థాన్ విజ‌యానికి 7 ప‌రుగులు అవ‌స‌రం. తొలి బంతిని రియాన్ ప‌రాగ్ ఆడ‌గా.. లెగ్ బై రూపంలో ఓ ప‌రుగు వ‌చ్చింది. రెండో బంతిని ఎదుర్కొన్న అశ్విన్.. బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా షాట్ కొట్టి బౌండరీ సాధించాడు. దీంతో విజ‌య‌స‌మీక‌రం 4 బంతుల్లో 2 గా మారింది.

బౌండ‌రీ సాధించిన అనంత‌రం అశ్విన్.. తన పడికిలితో గుండెను బాదుకుంటూ సెల‌బ్రేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎన్నడూ లేని విధంగా అశ్విన్ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చూసి నెటీజ‌న్లు వామ్మో అశ్విన్ నీలో ఇంత ఆవేశం ఉందా అని కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఈ సెలెబ్రేషన్స్‌పై మ్యాచ్ అనంతరం అశ్విన్‌ను ప్రశ్నించగా.. ఆ క్షణం తనలోకి డేవిడ్ వార్నర్ ప్రవేశించాడని అశ్విన్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 150 ప‌రుగులు చేసింది. మొయిన్ అలీ (93; 57 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడాడు. అనంత‌రం ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 19.4 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (59; 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌) ఆరంభంలో ధాటిగా ఆడ‌గా.. ఆఖ‌ర్లో ఒత్తిడిని అధిగ‌మిస్తూ ర‌విచంద్ర‌న్ అశ్విన్ (40 నాటౌట్‌; 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చూడ‌ముచ్చ‌టైన ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించాడు.

Next Story
Share it