Joe Root : పాంటింగ్‌ను చేరుకున్నాడు.. స‌చిన్‌ను అందుకుంటాడా.?

సిడ్నీలోని SCG గ్రౌండ్‌లో జరుగుతున్న ఐదవ, చివరి యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజు మొదటి సెషన్ తర్వాత మ్యాచ్‌పై తమ పట్టును పటిష్టం చేసుకుంది.

By -  Medi Samrat
Published on : 5 Jan 2026 9:23 AM IST

Joe Root : పాంటింగ్‌ను చేరుకున్నాడు.. స‌చిన్‌ను అందుకుంటాడా.?

సిడ్నీలోని SCG గ్రౌండ్‌లో జరుగుతున్న ఐదవ, చివరి యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజు మొదటి సెషన్ తర్వాత మ్యాచ్‌పై తమ పట్టును పటిష్టం చేసుకుంది. అనుభవజ్ఞుడైన జో రూట్‌ అద్భుత సెంచరీతో ఇంగ్లండ్‌ లంచ్‌ వరకు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. రెండవ రోజు జో రూట్ ఇంగ్లండ్ తరఫున అద్భుతమైన సెంచరీని సాధించాడు. దీంతో అత‌డు ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు. ఇప్పుడు అతని చూపు గ్రేట్ సచిన్ టెండూల్కర్ రికార్డుపై పడింది.

ఇంగ్లండ్ జట్టు 211/3 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించింది. క్రీజులో ఉన్న జో రూట్, హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే మిచెల్ స్టార్క్ 48వ ఓవర్లో బ్రూక్‌ను అవుట్ చేయడం ద్వారా 169 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా ప‌ట్టు సాధించారు. 84 పరుగులు చేసి బ్రూక్ ఔటయ్యాడు. దీని తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను ఖాతా తెరవకుండానే అవుట్ చేసి ఇంగ్లండ్‌కు స్టార్క్ షాకిచ్చాడు. టెస్టు క్రికెట్‌లో స్టార్క్ స్టోక్స్‌ను అవుట్‌ చేయడం ఇది 14వ సారి.

అయినప్పటికీ జో రూట్ సహనం కోల్పోకుండా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జామీ స్మిత్‌తో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. స్మిత్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ కొన్ని అద్భుతమైన షాట్లు కొట్టాడు. కాగా, రూట్ 60వ ఓవర్ తొలి బంతికే తన 41వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో అతనికిది రెండో సెంచరీ.

రూట్ టెస్టు కెరీర్‌లో ఇది 41వ సెంచరీ. ఈ విధంగా, అతను టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికీ పాంటింగ్ (41)తో కలిసి ఉమ్మడిగా మూడవ స్థానానికి చేరుకున్నాడు. అతని కంటే ముందు జాక్వెస్ కలిస్ (45), సచిన్ టెండూల్కర్ (51) ఉన్నారు. 2021 తర్వాత రూట్‌కి ఇది 24వ టెస్టు సెంచరీ. ఇన్ని సెంచ‌రీలు ఏ బ్యాట్స్‌మెన్ చేయ‌లేదు.

అలాగే.. టెస్టుల్లో 150కి పైగా పరుగులు ఎక్కువ సార్లు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ ముందు వరుసలో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో మొత్తం 20 సార్లు 150కి పైగా పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. జో రూట్ 17 సార్లు ఈ ఫీట్ చేయడం ద్వారా మహేల జయవర్ధనే, రికీ పాంటింగ్‌లను దాటేశాడు.

Next Story