వందలో 200.. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ అరుదైన ఘనత
Joe Root double century on his 100th test match.చెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్
By తోట వంశీ కుమార్ Published on 6 Feb 2021 9:37 AM GMTచెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ చెలరేగిపోతున్నాడు. తన ఫామ్‌ను కొనసాగిస్తూ.. తొలి టెస్టులో ద్విశతకం(209) సాధించాడు. స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది డబుల్ సెంచరీని అందుకున్నాడు. అతడికి ఇది వందో టెస్టు కావడం విశేషం. ఇది తన కెరీర్‌లో ఐదో ద్విశతకం. గత మూడు టెస్టుల్లో ఇది రెండో డబుల్ సెంచరీ. కాగా.. భారత్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో విదేశీ కెప్టెన్‌గా రూట్ నిలిచాడు. అంతకముందు వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ 1975లో ద్విశతకం బాదాడు. శుక్రవారం 128 పరుగులు చేసిన రూట్.. శనివారం తొలి సెషన్‌లో 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
అనంతరం రెండో సెషన్‌లో అశ్విన్ వేసిన 143 ఓవర్‌లో సిక్సర్ బాది డబుల్ సెంచరీ సాధించాడు. మరోవైపు ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ డాన్‌బ్రాడ్‌మన్ తరువాత వరుసగా మూడు టెస్టుల్లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. వరుస టెస్టుల్లో అత్యధిక సార్లు 150కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్లలో ఏడో స్థానంలో నిలిచాడు. శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర 2007లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆ ఘనత సాధించి అందరికన్నా ముందున్నాడు. ఆ తరువాత వాలీ హేమండ్, డాన్ బ్రాడ్‌మన్, జహీర్ అబ్బాస్, ముదస్సార్ నజర్, టామ్ లాథమ్, జో రూట్ ఉన్నారు. ఈ ఇంగ్లాండ్ సారథి మాత్రమే 98, 99, 100వ టెస్టుల్లో ఈ ఘనత సాధించడం విశేషం.
263/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం రెండో రోజు ఆట ప్రారంభించిన జో రూట్, బెన్ స్టోక్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ జోడి భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. పిచ్ కూడా బ్యాటింగ్‌కు సహకరిస్తుండడంతో.. రూట్, స్టోక్స్ ఇద్దరూ పోటి పడి మరీ పరుగులు చేశారు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదడంతో.. స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌లను మనోళ్లు రెండుసార్లు వదిలేశారు. దీంతో అతడు హాఫ్ సెంచరీ బాదాడు. మరోవైపు రూట్ తన శైలిలో ఆడుతూ 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ మూడు వికెట్లు నష్టానికి 355 రన్స్ చేసింది.
రెండో సెషన్‌లో కూడా రూట్, స్టోక్స్ ధాటిగా ఆడారు. దీంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ స్పిన్నర్ నదీమ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. స్వీప్ షాట్‌కు ప్రయత్నించిన స్టోక్స్.. డీప్ లెగ్‌లో ఉన్న పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. దాదాపు క్యాచ్‌ను వదిలేసినంత పని చేసిన పుజారా.. చివర్లో ఆ క్యాచ్‌ను అందుకుని స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపించాడు. స్టోక్స్, రూట్‌లు నాలుగవ వికెట్‌కు 124 రన్స్ జోడించారు. అనంతరం రూట్‌కు పోప్ జతకలిశాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 400 దాటింది. రూట్ వికెట్ తీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వికెట్ల కోసం రివ్యూలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మూడు సమీక్షలూ వృథా అయ్యాయి.