చేతులెత్తేసిన భారత బౌలర్లు.. జోరూట్ శతకం.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్
Joe Root Dom Sibley show put England on top in Chennai test.చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు దుమ్మురేపడంతో ఆ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెలుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 5 Feb 2021 11:43 AM GMTచెన్నైలోని చెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు దుమ్మురేపడంతో ఆ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెలుతోంది. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 128 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు, అశ్విన్ ఓ వికెట్‌ను పడగొట్టారు. రెండో రోజు భారత బౌలర్లు విజృంభిస్తేనే ఇంగ్లాండ్‌ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోగలం.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు ఆ జట్టు ఓపెనర్లు బర్స్న్(33), సిబ్లీ(87) శుభారంభం అందించారు. వీరిద్దరు భారత బౌలర్ల సహానాన్ని పరీక్షించారు. వికెట్ కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అశ్విన్ విడగొట్టాడు. తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించాక బర్న్స్‌ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన లారెన్స్(0) పరుగుల ఖాతా తెరకుండానే బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ 67/2 తో లంచ్‌కు వెళ్లింది.
శ్రీలంకతో సిరీస్‌లో కొనసాగించిన ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతడికి మరో ఓపెనర్ సిబ్లీ చక్కని సహకారం అందించాడు. ఓ వైపు రూట్ అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోర్ వేగాన్ని పెంచుతూ ఉంటే.. సిబ్లీ మాత్రం డిఫెన్స్ కే ప్రాధాన్యం ఇచ్చాడు. రూట్.. 164 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో శతకాన్ని అందుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 78వ ఓవర్ ఆఖరి బంతిని స్క్వేర్ లెగ్‌లోకి ఆడిన రూట్.. క్విక్ సింగిల్‌తో సెంచరీ మార్క్ అందుకున్నాడు. కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడుతున్నజోరూట్‌కు ఇది 20వ సెంచరీ.
తొలుత హాఫ్ సెంచరీకి 110 బంతులు తీసుకున్న జోరూట్ అనంతరం ధాటిగా ఆడి మరో 54 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. దాంతో 98, 99, 100వ మ్యాచ్‌ల్లో సెంచరీలు అందుకున్న తొలి క్రికెటర్‌గా జోరూట్ చరిత్ర కెక్కాడు. ఇక 100వ మ్యాచ్‌లో సెంచరీ చేసిన 9వ ఆటగాడిగా కూడా ఈ ఇంగ్లండ్ కెప్టెన్ గుర్తింపు పొందాడు. మరోవైపు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న సిబ్లీ సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 200 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఆఖరి ఓవర్‌లో బుమ్రా మరోసారి అద్భుత బాల్‌తో సిబ్లీని ఎల్బీ పెవిలియన్ చేర్చాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.