ఇషాన్ కిష‌న్ మెరుపులు.. ఆనందంలో ముంబై ఇండియ‌న్స్‌

Jharkhand captain ishan kishan slams 173 off 94 balls vs madhya pradesh.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2021 సీజ‌న్‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Feb 2021 3:24 PM IST
ఇషాన్ కిష‌న్ మెరుపులు.. ఆనందంలో ముంబై ఇండియ‌న్స్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2021 సీజ‌న్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ ఆట‌గాడు ఇషాన్ కిష‌న్ ఇర‌గ‌దీశాడు. విజ‌య్ హ‌జారే ట్రోఫీలో భారీ శ‌త‌కంతో దుమ్ములేపాడు. కేవలం 94 బంతుల్లో 19 పోర్లు, 11 సిక్స‌ర్లు బాది 173 ప‌రుగులు చేశాడు. ఇషాన్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తోడు అనుకుల్ రాయ్ 39 బంతుల్లో 3 పోర్లు, 7 సిక్స‌ర్లల‌తో 72 ప‌రుగుల మెరుపు ఇన్నింగ్స్ తోడ‌వ‌డంతో.. జార్ఖండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 422 ప‌రుగులు చేసింది. దీంతో టోర్నీ చ‌రిత్ర‌లో అత్యధిక స్కోర్ సాధించిన జ‌ట్టుగా నిలిచింది.

విజ‌య్ హ‌జారే టోర్నీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త ప‌రుగులు చేసిన వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్‌ నిలిచాడు. తొలి హాఫ్ సెంచ‌రీని 40 బంతుల్లో పూర్తి చేశాడు ఇషాన్‌. ఇక ఆ త‌ర్వాత భారీ సిక్స‌ర్ల‌తో బెంబేలెత్తించాడు. అనంత‌రం విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన మ‌ధ్య ప్ర‌దేశ్ జ‌ట్టు 18.4 ఓవ‌ర‌ల్లో 98 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. వ‌రుణ్ ఆరోన్ 6 వికెట్ల‌తో స‌త్తా చాటాడు.


ఇషాన్ మెరుపుల‌ను గురించి ముంబై ఇండియ‌న్స్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ.. జార్ఖండ్ కెప్టెన్ జూలు విదిల్చాడు అని రాసుకొచ్చింది. గ‌త‌కొన్ని సీజ‌న్ల‌గా ముంబైకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఇషాన్ కిష‌న్ యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 13వ సీజ‌న్‌లో ఆక‌ట్టుకున్నాడు. ముంబై ఇండియ‌న్స్ క‌ప్పు గెల‌వ‌డంతో ఇషాన్ కీల‌క పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్ 14వ సీజ‌న్‌కు ముందు ఇషాన్ ఫామ్ అందుకోవ‌డం ముంబైకి ఆనందం క‌లిగించేదే.


Next Story