ఆకాశ్‌దీప్-బుమ్రా ఫాలోఆన్ త‌ప్పించ‌డ‌మే కాదు.. ఆ రికార్డును కూడా సమం చేశారు..!

గాబా టెస్టులో ఐదో రోజు భారత జట్టు తొలి ఇన్నింగ్సులో 260 పరుగులకు కుప్పకూలింది.

By Medi Samrat  Published on  18 Dec 2024 8:47 AM IST
ఆకాశ్‌దీప్-బుమ్రా ఫాలోఆన్ త‌ప్పించ‌డ‌మే కాదు.. ఆ రికార్డును కూడా సమం చేశారు..!

గాబా టెస్టులో ఐదో రోజు భారత జట్టు తొలి ఇన్నింగ్సులో 260 పరుగులకు కుప్పకూలింది. ఈ టెస్టులో తొలి మూడు రోజులు వెనుకంజలో ఉన్న టీమిండియా.. నాలుగో రోజు ఆకాశ్‌దీప్‌, బుమ్రా జోడీతో మ్యాచ్‌లో పునరాగమనం చేసింది. కేఎల్ రాహుల్ తర్వాత రవీంద్ర జడేజా, ఆకాశ్‌దీప్‌, బుమ్రా పటిష్టంగా బ్యాటింగ్‌ చేసి భారత్‌ను ఫాలో ఆన్‌ నుంచి కాపాడారు. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుపై 185 పరుగుల ఆధిక్యం సాధించింది. ఐదో రోజు ఆటలో ఆకాశ్‌దీప్-బుమ్రా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఇద్దరి మధ్య 47 పరుగుల భాగస్వామ్యం వ‌ద్ద బ్రేక్ ప‌డింది.

నాలుగో రోజు వీరిద్దరి జోడీ భారత్‌ను ఫాలోఆన్‌ నుంచి కాపాడింది. ఆ తర్వాత ఐదో రోజు కూడా ఇద్దరు ఆటగాళ్లు కలిసి 8 పరుగులు చేశారు. ఈ సమయంలో ఆకాశ్‌దీప్‌, బుమ్రా మధ్య 10వ వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో భారత్‌కు ఇది ఉమ్మడి మూడో అత్యధిక భాగస్వామ్యం. ఆకాశ్‌దీప్ 31 పరుగులు చేసి ఔట్ అవ్వ‌గా.. బుమ్రా 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఆస్ట్రేలియాలో టెస్ట్‌లో 10వ వికెట్‌కు భారత్ అత్యుత్తమ భాగస్వామ్య రికార్డు మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్-శివ్‌లాల్ యాదవ్‌ల పేరిట ఉంది. ఆ త‌ర్వాత అనిల్ కుంబ్లే-ఇషాంత్ శర్మ(2008)-58 పరుగులు, అజిత్ అగార్కర్- జహీన్ ఖాన్(2004)- 47 పరుగులు మూడో స్థానంలో ఉండ‌గా.. బుమ్రా-ఆకాశ్ దీప్(2024)- 47 పరుగుల భాగస్వామ్యంతో ఆ రికార్డును స‌మం చేశారు.

Next Story