టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. మరో మూడు వికెట్లు కనుక తీస్తే.. టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. బుమ్రా ఇప్పటి వరకు 52 టీ20 మ్యాచ్‌ల్లో 61వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతుండగా.. స్పిన్నర్ చాహల్ తొలి స్థానంలో ఉన్నాడు. చాహల్ కేవలం 49 మ్యాచుల్లోనే 63 వికెట్లను తీశాడు. ఇక ఈ ఇద్దరి తరువాత అశ్విన్ 46 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్(50) నాలుగు, హార్దిక్ పాండ్య(42) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా నేడు భారత జట్టు అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఈ పోరులో బుమ్రా నిప్పులు చెరిగే బంతులను విసిరి ఈ అరుదైన ఫీట్‌ను సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తొలి స్థానంలో ఉన్నాడు. 94 మ్యాచ్‌ల్లోనే 117 వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత లసిత్ మలింగ 84 మ్యాచుల్లో 107, రషీద్‌ఖాన్ 54 మ్యాచుల్లో 102, టీమ్ సౌథీ 85 మ్యాచుల్లో 101 వికెట్లు తీసి తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ జాబితాలో బుమ్రా 21వ స్థానంలో కొనసాగుతున్నాడు.