ఆఖర్లో జడ్డూ విధ్వంసం.. ఒక్క ఓవర్ లోనే 37 పరుగులు
Jadeja's whirlwind 62 takes CSK to 191. రవీంద్ర జడేజా విధ్వంసంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది.
By Medi Samrat Published on 25 April 2021 5:41 PM ISTరవీంద్ర జడేజా విధ్వంసంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. 37 పరుగులు ఆఖరి ఓవర్లో రాబట్టాడు జడేజా.. అందులో 5 సిక్సర్లు ఉన్నాయి. 20 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్ కు ముందు వరకూ 170 పరుగులు చెన్నై చేయొచ్చని అందరూ భావించారు. కానీ జడ్డూ హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్ లో అయిదు సిక్సర్లు, ఒక ఫోర్, ఒక డబుల్ బాదాడు. అందులో ఒక నో బాల్ కూడా వేశాడు. 28 బంతులు ఆడిన జడేజా 62 పరుగులు చేశాడు. ధోని మూడు బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకూ అత్యధిక వికెట్లు తీసిన హర్షల్ పటేల్ కు జడేజా ఒక్క ఓవర్ లోనే చుక్కలు చూపించాడు. జడేజా 0 పరుగుల వద్ద క్యాచ్ వదిలేయడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(33) రూపంలో సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. చహల్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ తొలి బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన రుతురాజ్ జేమిసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 24 పరుగులు చేసిన సురేశ్ రైనా భారీ షాట్‌కు యత్నించి 14వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగో బంతికి రైనా(24) అవుటవ్వగా.. ఐదో బంతికి డుప్లెసిస్(50) క్రిస్టియన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 పరుగులు చేసిన అంబటి రాయుడు హర్షల్ పటేల్ బౌలింగ్‌లో జేమిసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జడేజా విధ్వంసం కొనసాగడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.