టీమ్ఇండియాకు షాక్‌.. ఆస్ప‌త్రిలో చేరిన ఇషాన్ కిష‌న్‌

Ishan Kishan taken to hospital after blow to the head in second T20I against SL.మ‌రో మ్యాచ్ మిగిలి ఉండానే శ్రీలంక‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Feb 2022 12:44 PM IST
టీమ్ఇండియాకు షాక్‌.. ఆస్ప‌త్రిలో చేరిన ఇషాన్ కిష‌న్‌

మ‌రో మ్యాచ్ మిగిలి ఉండానే శ్రీలంక‌తో టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న టీమ్ఇండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. యువ వికెట్ కీపర్‌, ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ మూడో టీ20లో ఆడ‌డం అనుమానంగా మారింది. ధ‌ర్మ‌శాల వేదిక‌గా లంక‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో ఇషాన్ కిష‌న్ త‌ల‌కు గాయ‌మైంది. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో లాహిరు కుమారా వేసిన బౌన్స‌ర్ ఇషాన్ హెల్మెట్‌ను బ‌లంగా తాకింది. దీంతో ఇషాన్ కిష‌న్ క్రీజు నుంచి కాస్త ప‌క్క‌కు వెళ్లి హెల్మెట్ తీసేశాడు. వెంట‌నే ఫిజియో వ‌చ్చి ప‌రిశీలించాడు. అయితే.. బాగానే ఉంద‌ని చెప్పిన ఇషాన్ బ్యాటింగ్ కొన‌సాగించాడు. 16 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్ చేశాడు.

ఇక మ్యాచ్ ముగిసిన అనంత‌రం భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఇషాన్‌ను కాంగ్రాలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించి వైద్య సేవ‌ల‌ను అందిస్తోంది. తలకు బలమైన గాయం తగిలిందా లేదా అన్న‌దాని కోసం సిటీస్కాన్ చేశారు. ప్ర‌స్తుతం ఇషాన్ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడ‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. దీంతో ఇషాన్ కిష‌న్ మూడో టీ20 ఆడేది అనుమానంగా మారింది. ఇక లంక ఆట‌గాడు దినేశ్ చండీమాల్ సైతం ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డ‌డంతో అత‌డిని కూడా ఇదే ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్‌ పథుమ్‌ నిషాంక (75; 11 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. చివ‌ర్లో కెప్టెన్‌ దసున్‌ షనక (19 బంతుల్లో 47 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరిద్ద‌రి ధాటిగా ఆడ‌డంతో ఆఖ‌రి 5 ఓవ‌ర్ల‌లో లంక 80 ప‌రుగులు సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌, బుమ్రా, హర్షల్‌, చాహల్‌, జడేజా తలా ఒక‌ వికెట్‌ పడగొట్టారు

శ్రీలంక నిర్ధేశించిన భారీ ల‌క్ష్యాన్ని భార‌త్ మ‌రో 17 బంతులు మిగిలి ఉండ‌గానే అంటే.. 17.1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేదించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (44 బంతుల్లో 74 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్ట‌గా.. సంజూ శాంసన్‌ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రవీంద్ర జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్‌; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) లు చెల‌రేగి ఆడారు. చాలా రోజుల త‌రువాత జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న శాంస‌న్ తొలుత త‌డ‌బ‌డినా.. కుదురుకున్న త‌రువాత త‌న‌దైన శైలిలో బ్యాట్ ఝ‌ళిపించాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌(1), ఇషాన్ కిష‌న్‌(16) లు విఫ‌లం అయ్యారు.

Next Story