ఇషాన్ కిష‌న్ అరుదైన ఘ‌న‌త‌.. పంత్ రికార్డ్ బ్రేక్‌

Ishan Kishan Breaks Rishabh Pant’s Record In The First T20I.టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ అరుదైన ఘ‌న‌త‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2022 4:48 PM IST
ఇషాన్ కిష‌న్ అరుదైన ఘ‌న‌త‌.. పంత్ రికార్డ్ బ్రేక్‌

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో ఒక మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు సాధించిన వికెట్ కీప‌ర్‌గా నిలిచాడు. గురువారం శ్రీలంక‌తో ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిష‌న్ 57 బంతుల్లో 10 పోర్లు 3 సిక్స‌ర్ల సాయంతో 89 ప‌రుగులు చేశాడు. త‌ద్వారా టీ20ల్లో వికెట్ కీప‌ర్‌గా అత్య‌ధిక ప‌రుగులు చేసిన రిష‌బ్‌పంత్ రికార్డును అధిగ‌మించాడు.

టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ ఎంఎస్ ధోనీ 2017లో ఇంగ్లాండ్‌తో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో 56 ప‌రుగులు చేసి ఒక మ్యాచ్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. ఆ రికార్డును రిష‌బ్ పంత్ 2019లో బ్రేక్ చేశాడు. వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లోనే 65 ప‌రుగులు చేసి ధోనిని అదిగ‌మించాడు. తాజాగా ఇషాన్.. పంత్ రికార్డును బ్రేక్ చేసి తొలి స్థానంలో నిలిచాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' ఇషాన్‌ కిషన్‌ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (28 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ‌శ‌త‌కాల‌తో బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోయ‌గా.. రోహిత్‌ శర్మ (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. దీంతో భార‌త్‌.. శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక బౌలర్లలో దసున్‌ షనక, లహిరు కుమార చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని చేదించేందుకు బ‌రిలోకి దిగిన లంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 137 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. చ‌రిత్‌ అసలంక (47 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు) ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేయ‌గా.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫ‌లం అయ్యారు. దీంతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజ‌యంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భార‌త్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 శ‌నివారం జ‌ర‌గ‌నుంది.

Next Story