మొన్న స‌చిన్‌.. నిన్న యూస‌ఫ్‌.. నేడు ఇర్ఫాన్ ల‌కుక‌రోనా.. ఆందోళ‌న‌లో మాజీ క్రికెట‌ర్లు

Ifran Pathan - Covid 19. రోడ్ సేఫ్టీ వ‌ర‌ల్డ్ సిరీస్‌లో పాల్గొన్న ఆట‌గాళ్లకు వ‌రుస‌గా క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ, తాజాగా ఇర్ఫాన్ పఠాన్‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2021 5:16 AM GMT
Irfan pathan, covid 19

టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ల‌ను క‌రోనా వైర‌స్ వెంటాడుతోంది. ఇటీవ‌ల ముగిసిన రోడ్ సేఫ్టీ వ‌ర‌ల్డ్ సిరీస్‌లో పాల్గొన్న ఆట‌గాళ్లకు వ‌రుస‌గా క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అవుతుండ‌డంతో మిగ‌తావారిలో ఆందోళ‌న పెరుగుతోంది. శుక్ర‌వారం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌, శ‌నివారం మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌కు క‌రోనా సోకగా.. ఆదివారం మాజీ బ్యాట్స్‌మన్‌ ఎస్‌ బద్రీనాథ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక సోమవారం మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ -19 పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఇర్ఫాన్ పఠాన్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించాడు.

'నాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఎలాంటి లక్షణాలు లేవు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నా. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వాళ్లందరూ పరీక్ష చేయించుకోండి. మాస్కులు పెట్టుకుని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని అందరినీ కోరుతున్నా. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా' అని పఠాన్ ట్వీట్ చేశాడు.

ఆందోళనలో మిగ‌తా ఆట‌గాళ్లు..

ఇర్ఫాన్ పఠాన్‌కు కరోనా సోకడంతో రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో పాల్గొన్న వారిలో క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన సిరీస్‌లో సచిన్, యూసఫ్, బద్రీనాథ్, ఇర్ఫాన్ పాల్గొన్నారు. వీరంతా ఇండియా లెజెండ్స్ తరుపున బరిలోకి దిగారు. అందరూ డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడంతో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మొహ్మద్ కైఫ్, మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా, నమన్ ఓజా, ఆర్ వినయ్ కుమార్‌లలో ఆందోళన మొదలైంది. రాయ్‌పుర్‌లో జరిగిన రోడ్‌సేఫ్టీ సిరీస్‌కు వేల సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించారు. అయితే.. అక్కడ కరోనా నిబంధనలేవీ పాటించలేదని నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఎంతమందికి కరోనా సోకుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story
Share it