ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అందుకున్న ఆటగాళ్లు వీరే..
IPL2020 Leading layers. ఏన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు, సూపర్ ఓవర్లు, పోటాపోటీ సమరాలు
By Medi Samrat Published on 11 Nov 2020 9:55 AM GMT
ఏన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు, సూపర్ ఓవర్లు, పోటాపోటీ సమరాలు, రన్‌రేట్‌ల దాగుడుమూతల మధ్య యూఏఈ వేదికగా గత రాత్రి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ముగిసింది. అయితే ఈసారి అయినా కొత్త విజేత వస్తుందనుకుంటే.. అలా జరగలేదు. రోహిత్ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మళ్లీ టైటిల్ గెలుచుకొని ఐదోసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది.
ఇక ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అందుకున్న ఆటగాళ్లు ఎవరు వారు ఏ జట్టుకు చెందినవారే ఓ సారి చూద్దాం.
ఆరెంజ్ క్యాప్ : టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్‌ను అందిస్తారు. ఈ సారి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దీనిని అందుకున్నాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్ లు ఆడిన రాహుల్ మొత్తం 670 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 5 అర్ధశతకాలు ఉన్నాయి. అయినప్పటికీ పంజాబ్ జట్టు టోర్నీని ఆరో స్థానంలో ముగించింది.
పర్పుల్ క్యాప్ : టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన వారిని పర్పుల్ క్యాప్ అందిస్తారు. ఈ సారి తన బుల్లెట్ లాంటి బంతులతో వికెట్లను ఎక్కువగా గిరాట్ వేసిన బౌలర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన కగిసో రబడా. 17 మ్యాచ్ లు ఆడిన రబడా మొత్తం 30 వికెట్లు సాధించాడు. 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం రబాడా అత్యుత్తమ ప్రదర్శన. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌లో ముంబై చేతిలో ఓటమితో రెండో స్థానంలో నిలిచింది.
ఎమర్జింగ్ ప్లేయర్ : ఎమర్జింగ్ ప్లేయర్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్యాట్స్‌మెన్ దేవదత్ పడికల్ నిలిచాడు. ఈ ఏడాదే ఐపీఎల్ లో ఆరంగేట్రం చేసిన పడికల్ 5 అర్ధశతకాలతో 473 పరుగులు సాధించాడు.