ఐపీఎల్ 2022 సీజన్.. 10 జట్లు 90 ఫ్లస్ మ్యాచ్‌లు
IPL mega auction franchises allowed to retain 4 players.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో ఇప్పటి వరకు
By తోట వంశీ కుమార్ Published on 5 July 2021 8:36 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో ఇప్పటి వరకు 8 జట్లతో దాదాపు 60 మ్యాచ్‌లను నిర్వహించారు. త్వరలోనే మరో రెండు కొత్త ప్రాంఛైజీలు రానున్నట్లు ఇప్పటికే బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. 2022 సీజన్ నుంచి ఈ రెండు కొత్త జట్లు కూడా బరిలోకి దిగనున్నాయి. ఇందుకోసం బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేసింది. రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల రీటెన్షన్ విధానం, భారీ వేలం, జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. రెండు ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి సెప్టెంబర్‌లో విక్రయం పూర్తి చేయనున్నారు. ఇక డిసెంబర్‌లో భారీ వేలం నిర్వహించనుంది.
ఐపీఎల్ 2021 నుంచే 10 జట్లను ఆడించాలని బీసీసీఐ చూసినా.. సమయం లేకపోవడంతో అది కుదరలేదు. ఇక కొత్త ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు.. సంజీవ్ గోయెంకా(కోల్‌కతా), అదానీ గ్రూప్(అహ్మదాబాద్), అరబిందో ఫార్మా(హైదరాబాద్), టొరెంట్ గ్రూప్(గుజరాత్) సహా మరికొన్ని వ్యాపార సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. కాగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్ దక్కించుకోనుందని సమాచారం. ఒక్కో ఫ్రాంచైజీ కనీస విలువ రూ.2000 కోట్లుగా ఉండొచ్చని తెలుస్తోంది.
నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకోవచ్చు..
ఇక జనవరి 2022లో మీడియా హక్కులు బీసీసీఐ ఇవ్వనుంది. ఐపీఎల్ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయేందుకు ఆస్కారం ఉంది. అలాంటప్పుడు ఫ్రాంచైజీల విలువ గరిష్ఠంగా 50% పెరుగుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం పై బీసీసీఐ స్పష్టత నిచ్చింది. మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు గరిష్టంగా 4 మంది ఆటగాళ్లను రీటైన్ చేసుకోవచ్చు. ఇందులో ముగ్గురు భారతీయులు, 1 విదేశీ ప్లేయర్ లేదా ఇద్దరు భారతీయులు మరియు ఇద్దరు విదేశీలను అట్టిపెట్టుకోవచ్చు. కాగా.. ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే రూ.15కోట్లు, రూ.11కోట్లు, రూ.7కోట్లు వారికి చెల్లించాలి. ఇద్దరిని తీసుకుంటే.. రూ.12.5కోట్లు, రూ.8.5కోట్లు, ఒక్కరినే తీసుకుంటే రూ.12.5కోట్లు చెల్లించాలి.
ప్లేయర్లకు చెల్లించే జీతాల నిధి మొత్తాన్ని రూ.85 నుంచి 90కోట్లకు పెంచింది. అంటే పది ప్రాంచైజీల నుంచి రూ.50కోట్లు జమ అవుతుంది. ప్రాంచైజీలు ఇందులో కనీసం 75శాతం ఖర్చు చేయాలి. ఏటా రూ.5కోట్లు పెంచుతూ 2024కు ఈ జీతాల నిధిని రూ.100కోట్లకు చేరుస్తారు. ఇదిలా ఉంటే.. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తమ ఫ్రాంచైజీలో కొంత వాటాను ఓ సంస్థకు విక్రయించింది. దాని విలువను రూ.1855 కోట్లు. అలాంటప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ విలువ కనీసం రూ.2200-2500 కోట్లుగా ఉండొచ్చట. ముంబై ఇండియన్స్ విలువ రూ.2700-2800 కోట్లు ఉంటుందని అంచనా. కోల్‌కతా, బెంగళూరు విలువ సైతం ఎక్కువగానే ఉండొచ్చు.