IPL-2026: డగౌట్‌లో మొబైల్ వాడిన ఆర్‌ఆర్ మేనేజర్.. నిబంధనలు ఉల్లంఘించారా?
ఐపీఎల్ - 2026 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు ఒక అనూహ్య వివాదంలో చిక్కుకుంది.
By - అంజి |
IPL-2026: డగౌట్‌లో మొబైల్ వాడిన ఆర్‌ఆర్ మేనేజర్.. నిబంధనలు ఉల్లంఘించారా?
ఐపీఎల్ - 2026 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు ఒక అనూహ్య వివాదంలో చిక్కుకుంది. గౌహతిలోని బర్సపరా స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్‌లో మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 202 పరుగుల ఛేదనలో వైభవ్ సూర్యవంశీ అవుటైన కాసేపటికే, రోమీ భిందర్ తన ఫోన్‌లో ఏదో టైప్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు. టీమ్ డగౌట్‌లో మొబైల్ ఫోన్ వాడటం నిబంధనలకు విరుద్ధమని, అసలు యాంటీ కరప్షన్ (అవినీతి నిరోధక) అధికారులు ఏం చేస్తున్నారని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా' (PMOA)లో మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం పూర్తిగా నిషేధం. మ్యాచ్‌పై బయటి వ్యక్తుల ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తారు.
ఐపీఎల్ 2026 నిబంధనల ప్రకారం.. టీమ్ మేనేజర్ కేవలం డ్రెస్సింగ్ రూమ్ ఏరియాలో మాత్రమే ఫోన్ వాడుకోవచ్చు, కానీ డగౌట్‌లో ఫోన్ వాడటానికి వీల్లేదు. స్టేడియానికి చేరుకోగానే ఆటగాళ్లు, సిబ్బంది తమ ఫోన్లను సెక్యూరిటీ అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. కేవలం టీమ్ అనలిస్ట్‌కు మాత్రమే డేటా విశ్లేషణ కోసం కంప్యూటర్ వాడుకునే అనుమతి ఉంటుంది. ఒకవేళ రోమీ భిందర్ డ్రెస్సింగ్ రూమ్ లోపల ఫోన్ వాడి ఉంటే అది నిబంధనల ఉల్లంఘన అయ్యేది కాదు, కానీ డగౌట్‌లో ఫోన్ వాడటం వల్ల ఆయన నిషిద్ధ ప్రాంతంలోకి వెళ్లినట్లయింది.
ఈ ఘటనపై మైదానంలో ఉన్న యాంటీ కరప్షన్ మేనేజర్లు తమ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ అయితే, రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌కు భారీ జరిమానాతో పాటు తాత్కాలిక సస్పెన్షన్ విధించే అవకాశం ఉంది. మైదానంలో అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు, ఈ వివాదం ఒక ఇబ్బందికర పరిణామంగా మారింది. ఆ జట్టు తన తదుపరి మ్యాచ్‌లో సోమవారం (ఏప్రిల్ 13న) హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో తలపడనుంది.