IPL-2024: టాప్-2పై సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్
ఈ సీజన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పలు రికార్డులను బద్దలుకొట్టింది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 6:30 PM ISTIPL-2024: టాప్-2పై సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్
ఈ సీజన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఇక మరో లీగ్ మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అయ్యింది. ఇక ఇప్పుడు చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్దం అవుతూ.. పాయింట్ల పట్టికలో టాప్-2పై గురిపెట్టింది. కీలక ఆటగాళ్లు దూరమై బలహీనంగా ఉన్న పంజాబ్ కింగ్స్ గెలుపుతో సీజన్‌ను ముగించాలని ఎస్‌ఆర్‌హెచ్ భావిస్తోంది. అయితే.. ప్రస్తుతం 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ఈ టీమ్ టాప్-2లో నిలవాలంటే పంజాబ్‌పై నెగ్గడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.
క్వాలిఫయర్-1కు ఎస్‌ఆర్‌హెచ్ అర్హత సాధించాలంటే ఆదివారం జరగనున్న రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలవాలి. అయితే.. కేకేఆర్ 19 పాయింట్లు, రాజస్థాన్ 16 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్‌పై హైదరాబాద్ నెగ్గితే మరో రెండు పాయింట్లు యాడ్ అవుతాయి. దాంతో.. నేరుగా రాజస్థాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో ఉంటుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.
ఇక టాప్-2లో నిలిచిన జట్లు క్వాలిఫయర్-1కి చేరుకుంటాయి. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో పోటీ పడుతుంది. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి. ఇక క్వాలిఫయిర్-1, క్వాలిఫయిర్-2లో గెలిచిన జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయి. అందుకే టాప్-2లో స్థానం కోసం ఎస్‌ఆర్‌హెచ్ గురిపెట్టింది.
ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ భువనేశ్వర్‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రేపు విశ్రాంతి ఇస్తే.. ఆ తర్వాత జరగబోయే ఇంపార్టెంట్ మ్యాచుల్లో బాగా రాణిస్తాడని భావిస్తోంది. భువనేశ్వర్ స్థానంలో ఉమ్రాన్, సన్వీర్ సింగ్ స్థానంలో మయాంక్, షాబాజ్ అహ్మద్‌కు బదులుగా సుందర్‌ను తీసుకోవాలని యోచిస్తోంది.
పంజాబ్‌తో ఆడబోయే SRH తుది జట్టు అంచనా:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, విజయ్‌కాంత్, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్.