చెన్నైపై ఘనవిజయం.. ప్లేఆఫ్స్ ఖాయం చేసుకున్న ఆర్సీబీ
ఉత్కంఠ భరితమైన మ్యాచ్ శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సాగింది.
By Srikanth Gundamalla Published on 19 May 2024 6:30 AM ISTచెన్నైపై ఘనవిజయం.. ప్లేఆఫ్స్ ఖాయం చేసుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్‌లో అసలు సిసలైన ఉత్కంఠ భరితమైన మ్యాచ్ శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సాగింది. ఈ ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్‌లో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో పాటు మెరుగైన రన్‌రేట్ సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ సీఎస్కే ప్లేఆఫ్స్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ముందుగా బ్యాటింగ్ చేసి రాణించింది. భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు 218 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 47 పరుగులు చేశాడు. డూప్లెసిస్ 39 బంతుల్లో 54 పరుగులు చేయగా..రజత్ పాటిదార్ 23 బంతుల్లో 41 పరుగులు, మ్యాక్స్‌వెల్ 5 బంతుల్లో 16 మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, తుషారా దేశ్‌పాండే తలో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత 219 టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. రచిన్ రవీంద్ర 37 బంతుల్లో 61 పరుగులు చేశాడు. జడేజా 22 బంతుల్లో 42, ధోనీ 13 బంతుల్లో 25 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ 2 వికెట్లు, మ్యాక్స్‌వెల్, సిరాజ్, ఫెర్గూసన్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీశారు.