రోహిత్‌కు షాక్.. ముంబై ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌గా హార్దిక్

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా పేరున్న టీమ్ ముంబై ఇండియన్స్.

By Srikanth Gundamalla  Published on  15 Dec 2023 6:33 PM IST
ipl-2024, mumbai indians, new captain, hardik ,

రోహిత్‌కు షాక్.. ముంబై ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌గా హార్దిక్ 

ఇండియాలో క్రికెట్‌ అభిమానులు ఎక్కువే ఉంటారు. క్రికెట్‌ మ్యాచ్‌లు ఉంటే చాలు స్టేడియంలో టికెట్‌ ధరలు ఎంత ఉన్నా సరే.. తమ ఖర్చులను తగ్గించుకుని మరీ టికెట్‌ కొని మ్యాచ్‌ను లైవ్‌లో చూస్తుంటారు. ఈ క్రమంలో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఐపీఎల్‌ సీజన్‌ సాగినన్ని రోజులు క్రికెట్‌ అభిమానులకు పండగనే చెప్పాలి. ఆక్షన్ నుంచి మొదలుకొని చివరి ఫైనల్‌ మ్యాచ్‌ వరకు ఐపీఎల్‌ గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఈసారి జరగబోయే ఐపీఎల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా పేరున్న టీమ్ ముంబై ఇండియన్స్. ఆ జట్టుకు రోహిత్‌ శర్మ ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందజేశాడు. అయితే.. తాజాగా రోహిత్‌కు ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్ భారీ షాక్‌ ఇచ్చింది. 2024లో జరగబోయే ఐపీఎల్ సీజన్‌కు కొత్త సారథిని ప్రకటించింది. ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ను తొలగిస్తూ.. ఆ బాధ్యతలను హార్దిక్‌ పాండ్యాకు అప్పగించింది. ఈ మేరకు ముంబై ఇండియన్‌ అధికార ప్రకటన చేసింది. ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా పోస్టు పెట్టింది. ఈ ప్రకటన చూసిన రోహిత్ శర్మ అభిమానులు అంతా షాక్‌ అవుతున్నారు. ఎందుకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుందో అని తెగ ఆలోచిస్తున్నారు. పదేళ్లుగా రోహిత్‌ నాయకత్వంలో ఉన్న ముంబైకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌లో హిట్‌మ్యాన్‌ శకం ముగిసినట్లు అయ్యిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముంబై ఇండియన్స్‌కు మొదటగా సచిన్‌, ఆ తర్వాత హార్బజన్‌ సింగ్, రికీ పాంటింగ్‌ నాయకత్వం వహించారు. 2013 మధ్యలో రికీ పాంటింగ్ నుండి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ బాధ్యతలు స్వీకరించాడు. ఈ సీజన్‌లో ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి జట్టును తొలి టైటిల్‌ అందించాడు. 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్‌ సీజన్లలో ముంబై ఇండియన్స్‌కు ట్రోఫీని అందించాడు రోహిత్ శర్మ. ఇక హార్డిక్‌ పాండ్యా 2015లో ముంబై ఇండియన్స్‌తోనే తన ఐపీఎల్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. 2022 ఐపీఎల్‌ సీజన్‌లో తొలిసారి ఏర్పడ్డ గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి అదే సీజన్‌లో విన్నర్‌గా నిలిపాడు. ఆ తర్వాత 2023లో గుజరాత్‌ను రన్నరప్‌గా నిలిపాడు హార్దిక్‌ పాండ్యా. ఏది ఏమైనా రోహిత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించడం ఆ టీమ్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి.

Next Story