మేము రాణించలేదు.. కానీ వారు మాత్రం అద్భుతం: హార్దిక్ పాండ్యా

ఐపీఎల్-2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ టీమ్‌కు వరుసగా పరాభవాలే ఎదురవుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  2 April 2024 10:44 AM IST
ipl-2024, mumbai, captain hardik,  match,

మేము రాణించలేదు.. కానీ వారు మాత్రం అద్భుతం: హార్దిక్ పాండ్యా

ఐపీఎల్-2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ టీమ్‌కు వరుసగా పరాభవాలే ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో హోంగ్రౌండ్‌లో ఆడిన మ్యాచ్‌లను ప్రతి టీమ్‌ విన్‌ అయ్యాయి. అలాగే ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌ల మధ్య మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. కానీ.. ఈ మ్యాచ్‌లో కూడా ముంబైకి ఓటమి తప్పలేదు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ముంబై ఓడిపోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై దారుణంగా విఫలమైంది. రాజస్థాన్‌ బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, స్పిన్నర్‌ చాహల్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక బర్గర్ రెండు వికెట్లు తీయగా.. అవేశ్‌ ఖాన్ ఒక వికెట్‌ తీశాడు. ఆ తర్వాత 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది రాజస్థాన్‌ రాయల్స్. 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేదించింది. ఇక రాజస్థాన్‌ బ్యాటర్‌ రియాన్‌ పరాగ్ 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

వరుసగా మూడో ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్‌లో తాము అనుకున్న విధంగా రాణించలేకపోయామని చెప్పాడు. వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడం బాధగా ఉందన్నాడు. తొలుత మంచి ఆరంభం లభించలేదని చెప్పాడు. కానీ బ్యాటింగ్‌కు వచ్చాక ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేయాలని అనుకున్నట్లు చెప్పాడు. తిలక్‌తో పాటు ఆడుతున్నప్పుడు 150 నుంచి 160 పరుగులు చేరుతుందని భావించినట్లు పాండ్యా పేర్కొన్నాడు. కాసేపటికే ఔట్‌ అవ్వడంతో మరోసారి మ్యాచ్‌ మళ్లీ రాజస్థాన్‌ చేతుల్లోకి వెళ్లిపోయిందని అన్నాడు. వాంఖడే వికెట్‌ ఊహించినదాని కంటే భిన్నంగా ఉందని తెలిపాడు. ఇది సాకుగా చెప్పాలనుకోవడం లేదనీ.. ఒక బ్యాటర్‌గా ఎలాంటి వికెట్‌పైనా ఆడటానికి అయినా సిద్ధంగా ఉండాలని చెప్పాడు. ఏదేమైనా ప్రత్యర్థి బౌలర్లు మాత్రం అద్భుతంగా రాణించారని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా చెప్పాడు.

Next Story