IPL 2024: ఆఖరి మ్యాచ్ లోనూ చేతులెత్తేసిన ముంబై ఇండియన్స్
5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్ ఏ మాత్రం కలిసి రాలేదు. లక్నో జట్టుతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో కూడా గెలవలేకపోయింది.
By M.S.R Published on 18 May 2024 8:00 AM ISTఆఖరి మ్యాచ్ లోనూ చేతులెత్తేసిన ముంబై ఇండియన్స్
5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్ ఏ మాత్రం కలిసి రాలేదు. కెప్టెన్ గా రోహిత్ శర్మను కాదని.. హార్దిక్ పాండ్యాను తీసుకుని రావడం. జట్టు సమిష్టిగా రాణించలేకపోవడం. బ్యాటింగ్ లో తిలక్ వర్మ, బౌలింగ్ లో బుమ్రా తప్ప.. మిగిలిన ఎవరూ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఆ జట్టు టోర్నీలో కనీసం కోలుకోలేకపోయింది. గెలవాల్సిన మ్యాచ్ లు కూడా చేజేతులా ఓడిపోయి.. చివరికి ఈ సీజన్ లో ఆఖరి స్థానంలో నిలిచింది. లక్నో జట్టుతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో కూడా గెలవలేకపోయింది.
ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ కేవలం 29 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. పూరన్ 5 ఫోర్లు, 8 సిక్సులు బాదాడు. అతడికి కెప్లెన్ కేఎల్ రాహుల్ నుంచి చక్కని సహకారం లభించింది. రాహుల్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 55 పరుగులు చేశాడు. స్టొయినిస్ 28 పరుగులు చేయగా, చివర్లో ఆయుష్ బదోనీ 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 22 పరుగులు చేశాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో నువాన్ తుషార 3, పియూష్ చావ్లా 3 వికెట్లు తీశారు.
లక్ష్యఛేదనలో ముంబయి జట్టు కొద్దిసేపు ధాటిగా ఆడింది. రోహిత్ శర్మ మెరుపులను వాంఖడే మైదానంలో అభిమానులు చూశారు. 38 బంతుల్లో రోహిత్ శర్మ 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే రోహిత్ అవుట్ అయ్యాక మిగిలిన ఆటగాళ్లెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సూర్య కుమార్ యాదవ్ డకౌట్ అవ్వగా.. హార్దిక్ 16, ఇషాన్ కిషన్ 14, డెవాల్డ్ బ్రెవిస్ 23 పరుగులు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ మాత్రమే ముంబై శిబిరంలో ఆనందాన్ని నింపాడు. 28 బంతుల్లో 62 పరుగులు చేశాడు నమన్. అయితే మిగిలిన ఆటగాళ్ల నుండి సహకారం పెద్దగా లేకపోవడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు మాత్రమే చేసి 18 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.