రాహుల్‌ను బుజ్జగించే పనిలో లక్నో ఫ్రాంచైజీ..!
కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా సీరియస్ అయ్యాడు.
By Srikanth Gundamalla Published on 14 May 2024 11:39 AM GMTరాహుల్‌ను బుజ్జగించే పనిలో లక్నో ఫ్రాంచైజీ..!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర ఓటమిని చూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా సీరియస్ అయ్యాడు. బహిరంగంగా.. కెమెరాల ముందే తిట్టాడు. దాంతో.. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. టీమ్ కెప్టెన్ ను అలా అందరి ముందే తిట్టడం.. కెమెరాల ముందే సీరియస్ అవ్వడాన్ని అందరూ తప్పుబట్టారు. కేఎల్ రాహుల్ కూడా సంజీవ్ ఆవేశంగా మాట్లాడుతుంటే.. తిరిగి ఏమీ అనలేదు. దాంతో.. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్‌తో అమర్యాదగా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లతో పాటు.. ఇతర క్రికెట్ ప్రముఖులు మండిపడ్డారు. లక్నో ఫ్రాంచైజీపై భారత మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు చేశారు. వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్, షమీ వంటి ఆటగాళ్లు రాహుల్‌కి అండగా నిలుస్తూ.. సంజీవ్ వ్యవహారాన్ని తప్పుబట్టారు. ఏదైనా చెప్పాలనుకుంటే నాలుగు గోడల మధ్య చెప్పాలి కానీ.. ఇలా బహిరంగంగా తిట్టడం ఏంటో అన్నారు.
ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రెండు సీజన్లలో జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లిన కెప్టెన్ అని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించిన తీరుపై రాహుల్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సీజన్ ముగిసిన తర్వాత లక్నో ఫ్రాంచైజీకి రాహుల్ గుడ్‌బై చెబుతాడని తెలిసింది. అంతేకాదు.. తన రాష్ట్ర టీమ్ అయిన ఆర్‌సీబీ తరఫున బరిలోకి దిగుతాడని కథనాలు వచ్చాయి. డుప్లెసిస్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలు రాహుల్‌కి అందించాలని బెంగళూరు ఫ్రాంచైజీ కూడా ఆసక్తిగా చూస్తోందని వార్తలు వినిపించాయి.
ఇలాంటి విమర్శలు.. వార్తల నడుమ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఫ్రాంచైజీ యజమాని అయిన సంజీవ్ రాహుల్‌ను ప్రత్యేకంగా కలిశాడు. రాహుల్‌తో కలిసి భోజనం చేశాడు. తాను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్ని మర్చిపోయి రాహుల్ లక్నోతో కొనసాగుతాడా? లేదంటే సోషల్ మీడియాలో జరగుతున్న ప్రచారాన్ని త్వరలోనే నిజం చేస్తాడా తెలియాల్సి ఉంది. మరో జరగబోయే సీజన్ వరకు వెయిట్ చేయాల్సిందే.