చరిత్రకెక్కిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ రిషబ్ పంత్

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 3వేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిని చరిత్రకెక్కాడు.

By Srikanth Gundamalla  Published on  13 April 2024 9:00 AM IST
ipl-2024, delhi capitals, rishabh pant, record,

చరిత్రకెక్కిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ రిషబ్ పంత్

రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై తిరిగి కోలుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ రిషబ్‌ పంత్. కొంతకాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే.. ఈ ఐపీఎల్ సీజన్‌ద్వారానే పంత్‌ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంతో అతను ఎలా ఆడుతాడో అని అనుమానాలు పెట్టుకున్న క్రికెట్‌ అభిమానులకు.. పంత్‌ గట్టి సమాధానం ఇస్తున్నాడు. వరుసగా రాణిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపులో కీలక పాత్రను పోషిస్తున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఆయుష్ బదోని (55 నాటౌట్‌)గా నిలిచాడు. కేఎల్ రాహుల్‌ (39) పరుగులు చేశాడు. ఇక కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అరంగేట్ర విదేశీ బ్యాటర్ జేక్‌ ఫ్రేజర్ మెక్‌గర్క్‌ (55) పరుగులు చేశాడు. ఇక రిషబ్‌ పంత్ 24 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ తర్వాత పంత్‌ అరుదైన రికార్డును అందుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 3వేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిని చరిత్రకెక్కాడు. రిషబ్‌ పంత్ 104 మ్యాచులు ఆడి 34 సగటుతో 3032 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో మూడు వేల పరుగులు అతి తక్కువ బంతుల్లో సాధించిన ప్లేయర్‌గా (2028 బంతుల్లో) రిషబ్‌ పంత్‌ రికార్డులకెక్కాడు. ఇక ఈ 2024 ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లో 194 పరుగులు చేశాడు రిషబ్. వీటిల్లో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్‌ రేసులో రిషబ్‌ ఆరో స్థానంలో ఉన్నాడు.

Next Story