ఐపీఎల్ 2022 మెగా వేలం.. పాల్గొనే ఆట‌గాళ్ల తుది జాబితా విడుద‌ల‌

IPL 2022 Players list announced for the mega auction by BCCI.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) మెగా వేలంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2022 6:20 PM IST
ఐపీఎల్ 2022 మెగా వేలం.. పాల్గొనే ఆట‌గాళ్ల తుది జాబితా విడుద‌ల‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) మెగా వేలంలో పాల్గొనే ఆట‌గాళ్ల తుది జాబితాను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విడుద‌ల చేసింది. మొత్తం 1214 మంది ఆట‌గాళ్లు వేలానికి రిజిస్ట్రేష‌న్ చేసుకోగా.. 590 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఇందులో 370 మంది భార‌త ఆటగాళ్లు కాగా.. 220 మంది విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు. 590 మందిలో 228 మంది క్యాప్‌డ్‌(జాతీయ జ‌ట్ల‌కు ఎంపికైన వారు) కాగా.. 355 మంది అన్‌క్యాప్‌డ్‌(జాతీయ జ‌ట్టుకు ఇంకా ఎంపిక కాని వారు), ఏడుగురు అసోసియేట్ దేశాల‌కు చెందిన వారు ఉన్నారు.

ఆస్ట్రేలియా నుంచి అత్య‌ధికంగా 47 మంది ఆట‌గాళ్లు వేలంలో పాల్గొన‌నున్నారు. ఆ త‌రువాత వ‌రుస‌గా వెస్టిండీస్‌(34), ద‌క్షిణాఫ్రికా (33), న్యూజిలాండ్(24), ఇంగ్లాండ్‌(24), శ్రీ‌లంక(23), ఆఫ్ఘ‌నిస్థాన్ (17), జింబాబ్వే నుంచి ఒకరు, నమీబియా నుంచి ముగ్గురు, నేపాల్‌ నుంచి ఒకరు, స్కాట్లాండ్‌ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొననున్నారు. ఇక విదేశీ ఆట‌గాళ్ల‌లో యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్‌గేల్‌, ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్‌లు ఐపీఎల్ వేలంలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

టీమ్ఇండియా ఆట‌గాళ్లు అశ్విన్‌, మహ్మద్‌ షమీ, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానే, సురేశ్‌ రైనా, యజువేంద్ర చహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్, విదేశీఆట‌గాళ్ల‌లో డేవిడ్ వార్న‌ర్‌, ప్యాట్ క‌మిన్స్‌, డుప్లెసిస్‌, ర‌బాడ, బౌల్ట్, డికాక్‌, బెయిర్ స్టో, హోల్డ‌ర్, డ్వేన్ బ్రావో, ష‌కిబ్ అల్ హ‌స‌న్‌ల కోసం తీవ్ర పోటీ ఉండ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

వేలంలో పాల్గొనబోతున్న వారిలో ఇమ్రాన్ తాహిర్‌(43) అత్య‌ధిక వ‌య‌సు క‌లిగిన ఆటగాడు కాగా.. ఆఫ్గానిస్థాన్ అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్ నూర్ అహ్మ‌ద్‌(17) తక్కువ వ‌య‌స్సు క‌లిగిన ఆట‌గాడు. 48 మంది తమ కనీస ధరను 2 కోట్లుగా పేర్కొనగా.. 20 మంది ఒకటిన్నర కోటి, 34 మంది ఒక కోటి రూపాయలను తమ బేస్‌ ప్రైస్‌గా పేర్కొన్నారు. ఈ జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్ త‌న‌యుడు అర్జున్ టెండూల్క‌ర్ రూ.20ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌, క్రికెట‌ర్ మ‌నోజ్ తివారీ, వెట‌ర‌న్ బౌల‌ర్ శ్రీశాంత్ చెరో రూ.50ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌తో మ‌రోసారి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలాన్ని నిర్వ‌హించ‌నున్నారు.

Next Story