ఐపీఎల్ వ‌చ్చేసింది.. చెన్నైపై కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంటుందా..?

IPL 2022 begins Today with CSK vs KKR.క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2022 12:38 PM IST
ఐపీఎల్ వ‌చ్చేసింది.. చెన్నైపై కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంటుందా..?

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) వ‌చ్చేసింది. కొత్తగా రెండు జ‌ట్లు రావ‌డంతో మొత్తం ప‌ది జ‌ట్లు క‌ప్ కోసం పోటీప‌డ‌నున్నాయి. ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా నేటి సాయంత్రం 7.30 గంట‌ల‌కు తొలి మ్యాచ్‌లో గ‌తేడాది ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ర‌న్న‌ర‌ప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా పూర్తి స్థాయిలో త‌గ్గ‌ని కార‌ణంగా ఈ సారి లీగ్‌ను ముంబై, పుణె న‌గ‌రాల‌కు ప‌రిమితం చేశారు. మైదానంలోకి 25 శాతం ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు.

లీగ్ ఆరంభానికి ముందు చెన్నై కెప్టెన్సీ నుంచి ధోని త‌ప్పుకోగా.. నూత‌న సార‌థిగా ర‌వీంద్ర జ‌డేజా బాధ్య‌త‌లు చేప‌ట్టనున్నాడు. గ‌త సీజ‌న్‌లో కోల్‌క‌తా జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన ఇయాన్ మోర్గాన్‌ను త‌ప్పించి అత‌డి స్థానంలో యువ ఆట‌గాడు శ్రేయస్ అయ్య‌ర్‌కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించింది కేకేఆర్‌. ఇక ఫిబ్ర‌వ‌రిలో ముగిసిన మెగా వేలంలో ఇరు జ‌ట్లు మంచి ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేశాయి. మ‌రీ తొలి మ్యాచ్‌లో ఎవ‌రు గెలిచి.. టోర్నిని శుభారంభంతో ఆరంభిస్తారో చూడాలి.

గ‌తేడాది క‌ప్ గెలిచి ఉత్సాహంతో ఉన్న చెన్నై ఈ సారి కూడా అదే ప్ర‌ద‌ర్శ‌నను పున‌రావృతం చేసి మ‌రోసారి టైటిల్ అందుకోవాల‌ని బావిస్తోంది. ఈ జ‌ట్టులో దాదాపు అంద‌రూ పాత ఆట‌గాళ్లే ఉండ‌డం జ‌ట్టుకు క‌లిసొచ్చే అంశం. రుతురాజ్ గైక్వాడ్‌, డెవాన్ కాన్వే ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగ‌నున్నారు. మొయిన్‌ అలీ దూరం కావడంతో మూడో స్థానంలో రాబిన్‌ ఊతప్ప వచ్చే అవకాశం ఉంది. అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ధోని, శివమ్‌ దూబే, డ్వేన్ బ్రావోతో మిడిలార్డర్ బ‌లంగా క‌నిపిస్తోంది. ఆడ‌మ్ మిల్నె, మ‌హేశ్ తీక్ష‌ణ‌, రాజ‌వ‌ర్థ‌న్ హంగార్గేక‌ర్ త‌దిత‌రుల‌తో పేస్ బౌలింగ్ విభాగం మెరుగ్గానే క‌నిపిస్తోంది. కాగా.. స్టార్‌ బౌలర్‌ దీపక్‌ చహర్‌ గాయపడటం సీఎస్‌కేకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. అత‌డి స్థానంలో ఎవ‌రిని తీసుకుంటారో చూడాలి.

ఇక కేకేఆర్‌ విషయానికొస్తే.. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్య‌ర్ సార‌థ్యంలో ఆ జ‌ట్టు రెట్టించిన ఉత్సాహంతో బ‌రిలోకి దిగ‌నుంది. వెంకటేశ్‌ అయ్యర్‌, అజింక్యా రహానే ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. వ‌న్ డౌన్‌లో కెప్టెన్‌ అయ్యర్‌ లేదా నితీశ్‌ రాణా బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. సామ్‌ బిల్లింగ్స్‌ రసెల్‌, నబీ, సునిల్‌ రైన్ వంటి హిట్ట‌ర్లు ఉండ‌డం ఆ జ‌ట్టుకు సానుకూలాంశం. పేసర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ ఆరంభమ్యాచ్‌లకు దూరం కానుండ‌గా.. టిమ్ సౌథీ, ఉమేశ్ యాద‌వ్‌, శివ‌మ్ మామి, చ‌మిక క‌రుణ‌ర‌త్నెల‌తో కూడిన పేస్ విభాగానికి తోడు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, మ‌హ‌మ్మ‌ద్ న‌బి వంటి స్పిన్న‌ర్లు అందుబాటులో ఉన్నారు.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు జ‌ట్లు 26 సార్లు త‌ల‌ప‌డ‌గా.. చెన్నై 17 మ్యాచ్‌లు గెలవగా, కోల్‌కతా కేవలం 8 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు. కాగా.. గ‌త సీజ‌న్‌లో మూడు సార్లు ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌గా.. మూడింటిలోనూ చెన్నై విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం.

Next Story