ఐపీఎల్ నిర‌వ‌ధిక వాయిదా

IPL 2021 suspended due to Covid-19 cases.ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 May 2021 7:59 AM GMT
IPL 2021 suspended

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2021 సీజ‌న్‌కు క‌రోనా సెగ త‌గిలింది. ఇప్ప‌టికే పలువురు ఆట‌గాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. నేడు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు చెందిన మ‌రో ఆట‌గాడు కూడా క‌రోనా బారిన ప‌డ్డాడు. దీంతో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఆట‌గాళ్లు క‌రోనా బారిన ప‌డుతుండ‌డంతో.. ఐపీఎల్ ను మధ్యలో ఆపేసి.. తర్వాత ఎప్పుడైనా మొదలు పెడుతారా అనే అంశాలను బీసీసీఐ ప‌రిశీలిస్తుంద‌ని.. విదేశాల్లో నిర్వ‌హించే ఆలోచ‌న చేస్తుంద‌నే వార్తలు వచ్చాయి. అయితే.. మ్యాచుల‌ను నిర‌వ‌ధిక వాయిదా వేస్తున్న‌ట్లు బీసీసీఐ అధికారి రాజీవ్ శుక్లా తెలిపారు. ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో నిన్నటి మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉండగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు. కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌కు వైరస్‌ సోకినట్లు తేలింది. జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతూ ఉండగా ఇప్పటికే పలువురు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోయారు. బయో బబుల్‌లో ఉండలేక లీగ్‌ నుంచి వైదొలిగారు. ఇక అత్యంత జాగ్రత్తల నడుమ బయో బబుల్‌ వాతావరణంలో టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తాజాగా వృద్ధిమాన్ సాహా, అమిత్ మిశ్రాలకు కూడా కరోనా సోకడంతో నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. మొదట ఐపీఎల్ ను యుఏఈకి షిఫ్ట్ చేయాలని భావించగా.. అందుకు బీసీసీఐ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇలా కరోనా కేసులు ఆటగాళ్లలో నమోదవ్వడంతో ఈ ఏడాది ఐపీఎల్ భవితవ్యంపై ఎన్నో అనుమానాలు నమోదవుతూ ఉన్నాయి.


Next Story