కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఏడాది ఐపీఎల్ 2021 సీజన్‌ను భారత్‌లోనే నిర్వహించనున్నట్లు ఇప్పటికే బీసీసీఐ( భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) వెల్లడించింది. కాగా.. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఐపీఎల్ పాలకమండలి నిర్ణయించింది. నేడు జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నారు.
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలోనే వేదికలను బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తొలుత ఒకే నగరంలో ఐపీఎల్‌ను నిర్వహించాలనుకున్నారు. అయితే.. ఆ నగరంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో మ్యాచ్ వేదికలను 4 నగరాలకు విస్తరించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ నగరాలను ఐపీఎల్ వేదికలుగా దాదాపు ఖరారు చేసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. వచ్చే వారం జరిగే భేటీలో ఐపీఎల్ మ్యాచ్ వేదికలతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది.