ఐపీఎల్ వేలంపాట వాయిదా..!
IPL-2021 Auction Postponed.ఐపీఎల్ 14వ సీజన్ కోసం నిర్వహించాల్సిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది.
By Medi Samrat Published on 22 Jan 2021 7:20 PM ISTక్రికెట్ ప్రేమికులకు ఆనందం పంచే మెగా టోర్నీ ఐపీఎల్ కోసం బీసీసీఐ సన్నద్ధమవుతూ ఉంది. ఆయా జట్ల ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే ఆటగాళ్ల ఎంపికపై దృష్టి సారించాయి. ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలు కావాల్సిన వాళ్ళను ఉంచుకుని.. మిగిలిన వాళ్ళను వదిలించుకున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫిబ్రవరిలో జరగబోయే మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలన్నీ వాళ్ల రిటెన్షన్ ప్లేయర్స్, వదిలేసిన ప్లేయర్స్ జాబితాను ప్రకటించాయి. కొన్ని టీమ్స్ పెద్ద పెద్ద ప్లేయర్స్‌ను వదిలేసి ఆశ్చర్యానికి గురి చేశాయి. రాజస్థాన్ రాయల్స్ స్టీవ్ స్మిత్‌ను వదిలేసింది. వచ్చే సీజన్‌లో ఆ టీమ్‌కు సంజు శాంసన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్ మోరిస్‌లాంటి ప్లేయర్స్‌ను ఆయా ఫ్రాంచైజీలు రిలీజ్ చేశాయి.
ఇక ఐపీఎల్ 14వ సీజన్ కోసం నిర్వహించాల్సిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది. ఫిబ్రవరి 11న ఐపీఎల్ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమైంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ.196 కోట్ల మేర ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ మినీ వేలం ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వేలం ప్రక్రియ ఫిబ్రవరి మూడో వారంలో ఉంటుందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్లను వేలం ప్రక్రియలో అందుబాటులోకి తీసుకువస్తారని తెలుస్తోంది.