భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ని అరెస్టు చేయాలని ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ.. యునైటెడ్ వాల్డ్ రెజ్లింగ్ మద్దతు ప్రకటించింది. ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా నిరసన తెలపడానికి వచ్చిన రెజ్లర్లను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని ఈ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని, రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేసింది.
బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రెజ్లర్లకు రైతు సంఘాలతో సహా అనేక మంది మద్దతు ఇస్తున్నారు. బ్రిజ్ భూషణ్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ, తాను నిర్దోషినని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల్లో కనీసం ఒకటి అయినా రుజువైతే, తాను ఉరివేసుకుని మరణిస్తానని చెప్పారు. సాక్ష్యాధారాలు ఉంటే, కోర్టుకు సమర్పించాలని.. ఏ శిక్షకైనా నేను సిద్ధమని ఆయన చెప్పారు. బ్రిజ్ భూషణ్‌పై నమోదైన కేసుల్లో ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లభించలేదని కొన్ని టీవీ చానళ్లు చెప్తున్నాయని, అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.