టీ20 ప్ర‌పంచ క‌ప్‌కు ముందు ఆస్ట్రేలియాకు కోలుకోలేని దెబ్బ‌..!

వచ్చే నెలలో ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్-2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తన తుది 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు

By -  Medi Samrat
Published on : 31 Jan 2026 2:27 PM IST

టీ20 ప్ర‌పంచ క‌ప్‌కు ముందు ఆస్ట్రేలియాకు కోలుకోలేని దెబ్బ‌..!

వచ్చే నెలలో ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్-2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తన తుది 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెన్ను సమస్య కారణంగా పాట్ కమిన్స్ ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అదే సమయంలో స్టీవ్ స్మిత్‌కు కూడా జట్టులో చోటు దక్కలేదు. మాథ్యూ షార్ట్‌ను జట్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో మాట్ రెన్‌షా ప్రపంచకప్‌లో ఆడనున్నాడు. జోష్ హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్ ప్రపంచకప్ ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

కండరాల సమస్య కారణంగా హాజిల్‌వుడ్ ఇప్పటికే యాషెస్ సిరీస్‌కు దూరమయ్యాడు. డేవిడ్ కూడా అదే సమస్య కారణంగా BBLలో పాల్గొనలేదు. అలాగే అతడు ప్రస్తుతం పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న‌ T20 సిరీస్‌లో కూడా ఆడ‌టం లేదు.

ముందుగా ప్రకటించిన 15 మంది సభ్యుల తాత్కాలిక జట్టులో కమిన్స్‌కు చోటు లభించింది. అందులో అతడు ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని, తర్వాత ఆడతాడని చెప్పబడింది. ఇప్పుడు అతను ప్రపంచకప్ ఆడలేడని తేలిపోయింది. యాషెస్ సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. అతడు డిసెంబర్‌లో అడిలైడ్‌లో తన చివరి మ్యాచ్ ఆడాడు. బెన్ ద్వార్షుయిస్‌కు జట్టులో చోటు దక్కింది. కానీ అతడు తాత్కాలిక జట్టులో లేడు. అయితే పేలవమైన ఫామ్ కారణంగా మాథ్యూ షార్ట్‌ని త‌ప్పించారు. స్పిన్‌లో మెరుగైన బ్యాట్స్‌మెన్‌గా ఉండటమే కాకుండా, రెన్‌షా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా ప్రాధాన్యతను పొందాడు.

కమిన్స్ పూర్తి ఫిట్‌గా ఉండేందుకు మరికొంత సమయం కావాలని క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్టర్ టోనీ డోడమెడ్ అన్నారు. “పాట్ కమిన్స్ అతని వెన్ను గాయం నుండి కోలుకోవడానికి మరింత సమయం కావాలి. బెన్ అతని స్థానాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్, అద్భుతమైన ఫీల్డర్‌గానే కాకుండా బలమైన బ్యాట్స్‌మన్ కూడా."

రెన్‌షా గురించి మాట్లాడుతూ.. "మాట్ అన్ని ఫార్మాట్లలో ఆకట్టుకున్నాడు. అతను ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్ బుల్స్, బ్రిస్బేన్ హీట్‌ల కోసం అనేక పాత్రలు పోషించాడు."

ఆస్ట్రేలియా జట్టు

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కన్నెల్లీ, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ రెన్‌షా, మార్కస్ స్టోయినిస్, ఐడెన్ జంపా.

Next Story