ఓటమి బాధలో ఉన్న ఇంగ్లాండ్ కు భారీ ఎదురుదెబ్బ
Injured Eoin morgan sam billings doubtful for second odi.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పుణె వేదికగా జరిగిన తొలి
By తోట వంశీ కుమార్
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పుణె వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 66 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. అసలే ఓటమి బాధలో ఉన్న ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, స్టార్ బ్యాట్స్‌మెన్ సామ్ బిల్లింగ్స్ రెండో వన్డే ఆడడం పై అనుమానం నెలకొంది. భారత్ ఇన్నింగ్స్ సందర్బంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ ఇయాన్ మోర్గాన్.. వెంటనే మైదానం వీడాడు. మోర్గాన్ బొటన, చూపుడు వేళ్ల మధ్యలో గాయం కావడంతో నాలుగు కుట్లు వేయాల్సి వచ్చింది. ఇక నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్‌కు దిగిన మోర్గాన్ 22 పరుగులు చేశాడు.
ఇక బౌండరీ ఆపే క్రమంలో సామ్ బిల్లింగ్స్ భుజానికి గాయమైంది. అతని ఎడమ భుజం డిస్ లొకేట్ కావడంతో అతను కూడా మైదానం వీడాడు. బ్యాటింగ్‌కు దిగినా ఇబ్బంది పడుతూనే ఆటను కొనసాగించాడు. 18 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో వీరు తదుపరి మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. మ్యాచ్ అనంతరం మోర్గాన్ మాట్లాడుతూ.. 48 గంటలు గడిస్తే గాని గాయాల తీవ్రత గురించి చెప్పలేనన్నాడు. శుక్రవారం జరిగే మ్యాచ్‌లోపు కోలుకోవాలని బావిస్తున్నట్లు చెప్పాడు.
తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది.శిఖర్ ధావన్ 98, విరాట్ కోహ్లీ 56, కేఎల్ రాహుల్ 62 నాటౌట్, కృనాల్ పాండ్యా 58 నాటౌట్ రాణించారు. అనంతరం ఇంగ్లాండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది.