చేజారిన కాంస్యం.. పోరాడి ఓడిన అమ్మాయిలు

Indian Women Hockey loses Bronze.చ‌రిత్ర సృష్టించే అవ‌కాశాన్ని భార‌త మ‌హిళా హాకీ జ‌ట్టు తృటిలో చేజార్చుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2021 3:50 AM GMT
చేజారిన కాంస్యం.. పోరాడి ఓడిన అమ్మాయిలు

చ‌రిత్ర సృష్టించే అవ‌కాశాన్ని భార‌త మ‌హిళా హాకీ జ‌ట్టు తృటిలో చేజార్చుకుంది. కాంస్య ప‌త‌కం కోసం జ‌రిగిన పోరులో 4-3 తేడాతో బ్రిటన్ చేతిలో ఓడిపోయింది. రాణి రాంపాల్ సేన గెలుపు కోసం చివ‌రి కంటా పోరాడింది. టీమ్ఇండియా ఉమెన్స్ స్పూర్తిదాయ‌క‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించింది. మ్యాచ్‌ ఆరంభమైన తొలి 10 నిమిషాల్లోనే రెండు గోల్స్‌ చేసి బ్రిటన్‌ గట్టి పోటీనివ్వగా.. పడిలేచిన కెరటంలా దూసుకుకొచ్చిన రాణి సేన రెండో క్వార్టర్‌లో కేవలం 5 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్‌ చేసి సత్తా చాటింది. భారత్‌ తరఫున గుర్జీత్‌ కౌర్‌ 2, వందనా కటారియా ఒక గోల్‌ చేశారు.

ఇక మూడ‌వ క్వార్ట‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగా సాగింది. గోల్ పోస్టును టార్గెట్ చేస్తూ దూకుడు ప్ర‌ద‌ర్శించిన బ్రిట‌న్ అమ్మాయిలు.. ఆ క్వార్ట‌ర్‌లో ఒక గోల్ చేశారు. దీంతో రెండు జ‌ట్లు 3-3 గోల్స్‌తో స‌మంగా నిలిచాయి. నాలుగో క్వార్టర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన చివరి 15 నిమిషాల ఆటలో బ్రిటన్‌ తొలి గోల్‌ చేసి 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి గెలుపును ఖరారు చేసుకుంది. భార‌త మ‌హిళ‌లు తీవ్రంగా శ్ర‌మించినా ఫ‌లితం ద‌క్క‌లేదు. దీంతో మహిళల హాకీ చరిత్రలో తొలి ఒలింపిక్‌ పతకం చేరాలని ఆశించిన భారత్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో బరిలో దిగి.. ఆద్యంతం గట్టి పోటీనిచ్చిన రాణి సేనకు యావత్‌ భారతావని మద్దతుగా నిలుస్తోంది.

Next Story