బౌలర్లు తెలివైనవారు.. ధోనీ, కోహ్లీ, రోహిత్‌ల కెప్టెన్సీపై బుమ్రా కామెంట్స్
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు
By Medi Samrat Published on 19 Aug 2024 3:23 PM ISTమహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు జట్టుపై ప్రభావం చూపి ఆటగాళ్లను ఎలా అభివృద్ధి చేశారో చెప్పాడు. ముగ్గురు కెప్టెన్ల నాయకత్వంలో ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో బుమ్రా కూడా ఉన్నాడు. ధోనీ కెప్టెన్సీలో అరంగేట్రం చేసిన బుమ్రా.. కోహ్లీ కెప్టెన్సీలో తనను తాను మెరుగుపరుచుకున్నానని.. రోహిత్ నాయకత్వంలో ఆటలో స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా మాట్లాడుతూ.. బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ బౌలర్ల పట్ల సానుభూతి చూపే అతికొద్ది మంది కెప్టెన్లలో రోహిత్ ఒకడని చెప్పాడు.
2011 ప్రపంచకప్‌తో సహా అనేక చిరస్మరణీయ విజయాలను భారత్‌కు అందించిన ధోని కెప్టెన్సీ గురించి తన అనుభవాలను కూడా బుమ్రా పంచుకున్నాడు. ధోనీ నాకు చాలా భద్రత కల్పించాడు. ఓవర్ ప్లానింగ్‌ను నమ్మడు. అదే అతనికి అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి అవసరమైన విశ్వాసాన్ని అందించిందన్నాడు.
కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా జట్టు ఫిట్‌నెస్ ప్రమాణాలను మార్చినందుకు, తన నాయకత్వ ఉనికిని కొనసాగించినందుకు కోహ్లీకి బుమ్రా ఘనత ఇచ్చాడు. విరాట్ శక్తివంతంగా, ఉద్వేగభరితంగా, దూకుడుగా ఉండేవాడని బుమ్రా అన్నాడు. కోహ్లీ ఇప్పుడు కెప్టెన్ కాదు.. కానీ ఇప్పటికీ నాయకుడిగా కొనసాగుతున్నాడు. కెప్టెన్సీ అనేది ఒక స్థానం.. కానీ జట్టు 11 మందితో రూపొందించబడింది అని పేర్కొన్నాడు.
బుమ్రా భారత టెస్ట్, T20 జట్లకు పలు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. బౌలర్‌లకు ప్రత్యేకమైన నాయకత్వ సామర్థ్యాలు ఉన్నాయని తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. తన కెప్టెన్సీ గురించి బుమ్రా మాట్లాడుతూ.. 'బౌలర్లు తెలివైనవారని నేను భావిస్తున్నాను.. ఎందుకంటే వారు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేస్తారు. మనం మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు సాధారణంగా బ్యాట్స్‌మెన్‌పై నిందలు వేస్తారు. బౌలర్లపై అంతగా ప్రభావం ఉండదు. కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి బౌలర్లు కెప్టెన్లుగా కూడా ఉన్నారని బుమ్రా ఉదహరించాడు. కపిల్ దేవ్ మనకు ప్రపంచకప్ కూడా అందించాడు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్‌కు ప్రపంచకప్ అందించాడు. అందుకే బౌలర్లు తెలివైనవారు.