చావు బతుకుల మధ్య క్రికెటర్

ఐర్లాండ్ తరఫున 35 వన్డేలు, 53 టీ20లు ఆడిన భారత సంతతికి చెందిన ఆల్ రౌండర్ సిమి సింగ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు

By Medi Samrat  Published on  5 Sept 2024 4:51 PM IST
చావు బతుకుల మధ్య క్రికెటర్

ఐర్లాండ్ తరఫున 35 వన్డేలు, 53 టీ20లు ఆడిన భారత సంతతికి చెందిన ఆల్ రౌండర్ సిమి సింగ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న క్రికెటర్ ప్రస్తుతం గురుగ్రామ్ ఆసుపత్రిలో ఐసియులో ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. కాలేయ మార్పిడి కోసం క్రికెటర్ ఎదురుచూస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మొహాలీలో జన్మించిన సిమి, U-14, U-17 స్థాయిలలో పంజాబ్ తరపున ఆడాడు, కానీ U-19 జట్టులో స్థానం సంపాదించడంలో విఫలమయ్యాడు.

అతను హోటల్ మేనేజ్‌మెంట్ అధ్యయనం కోసం ఐర్లాండ్ వెళ్లాడు. 2006లో, అతను డబ్లిన్‌లోని మలాహిడే క్రికెట్ క్లబ్‌లో ప్రొఫెషనల్‌ క్రికెటర్ గా చేరాడు. ఆ తర్వాత ఐర్లాండ్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అతను 39 ODI వికెట్లు, 44 T20I వికెట్లతో ఐర్లాండ్ తరపున ప్రముఖ క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. 2021లో దక్షిణాఫ్రికాపై వన్డే సెంచరీ కూడా చేశాడు.

సిమి సింగ్ మామ పర్వీందర్ సింగ్ మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఉన్నప్పుడు, సిమీకి జ్వరం వచ్చింది, అది వస్తూ పోతూ ఉండడంతో పలు టెస్టులు చేయించుకున్నాడు. ఆ తర్వాత అతడి సమస్య గురించి తెలిసింది. అతనికి 'మెరుగైన వైద్య సంరక్షణ' కోసం భారతదేశంలో చికిత్స చేయాలని నిర్ణయించుకున్నామని, జూన్ చివరలో సిమిని మొహాలీకి తీసుకుని వచ్చామన్నారు. సిమి ఇప్పుడు కాలేయ మార్పిడి కోసం వేచి చూస్తున్నారు. అతని భార్య అగందీప్ కౌర్ తన కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేయడానికి అంగీకరించింది.

Next Story