హాకీ ఇండియా అద్భుతం.. 41 ఏళ్ల త‌రువాత ప‌త‌కం

Indian hockey team creates history in Tokyo Olympics.హాకీ ఇండియా అద్భుతం చేసింది. టోక్యో లో భార‌త కీర్తి ప‌తాక‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2021 9:13 AM IST
హాకీ ఇండియా అద్భుతం.. 41 ఏళ్ల త‌రువాత ప‌త‌కం

హాకీ ఇండియా అద్భుతం చేసింది. టోక్యో లో భార‌త కీర్తి ప‌తాక‌ను రెప‌రెప‌లాడించింది. ఒలింపిక్స్ కాంస్య పోరులో మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత్‌ పురుషుల హాకీ జ‌ట్టు బ‌ల‌మైన జ‌ర్మ‌నీని 5-4 తేడాతో మ‌ట్టిక‌రిపించింది. దీంతో 41 ఏళ్ల త‌రువాత భార‌త పురుషుల హాకి జ‌ట్టు కాంస్య ప‌త‌కం ముద్దాడింది. పెనాల్టీ కార్నర్‌లు ఈ మ్యాచ్‌ను శాసించడం విశేషం.

ఒయి హాకీ స్టేడియం నార్త్‌ పిచ్‌లో గురువారం ఉద‌యం కాంస్యం కోసం భార‌త్‌-జ‌ర్మ‌నీ జట్లు పోటిప‌డ్డాయి. మ్యాచ్ ఆరంభ‌మైన రెండో నిమిషంలో జ‌ర్మ‌నీ గోల్ కొట్టి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్ట‌ర్‌లో సిమ్రాన్‌జిత్‌ గోల్‌ కొట్టడంతో స్కోర్‌ 1-1తో సమంగా ముగిసింది. ఇక మూడో క్వార్టర్ నుంచి నువ్వా నేనా అన్న‌ట్లుగా మ్యాచ్ సాగింది. జర్మనీ రెండు గోల్స్‌ కొట్టగా.. ఆ వెంటనే భారత్‌ మరో గోల్‌ కొట్టింది. ఆపై పెనాల్టీ కార్నర్‌ను అందిపుచ్చుకుని హాఫ్‌ టైం ముగిసేసరికి భారత్ 3-3తో స్కోర్‌ను స‌మం చేసింది.

అక్క‌డి నుంచి భార‌త్ హ‌వా మొద‌లైంది. మ‌రో గోల్ సాధించి 4-3తో ఆధిక్యం కనబరిచింది భారత్‌. ఆ వెంటనే మరో గోల్‌తో 5-3 ఆధిక్యంలో నిలిచి జర్మనీపై ఒత్తిడి పెంచింది. ప్ర‌త్య‌ర్థికి గోల్ చేసే అవ‌కాశం ఇవ్వ‌కుండా డిఫెండింగ్ గేమ్ ఆడింది. మ‌రో వైపు జ‌ర్మ‌నీ గోల్ చేసేందుకు విశ్వ‌ప్ర‌యత్నాలు చేసింది. చివ‌రికి ఓ గోల్ సాధించింది. అప్ప‌టికి 5-4తో భార‌త్ ఆధిక్యంలోనే కొన‌సాగింది. మరో గోల్‌ దక్కకుండా చాలా ప్రయత్నించింది భారత్‌. ఆఖర్లో జర్మనీకి దక్కిన పెనాల్టీ కార్నర్‌ విఫలం కావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఆఖర్లో సెకన్ల ‍వ్యవధిలో దక్కిన జర్మనీ షూట్‌ అవుట్‌ పెనాల్టీని అడ్డుకోవడంతో.. భారత్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.

Next Story