భారత జట్టుకు చెన్నై టెస్ట్ లో ఇంగ్లాండ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0తో లీడ్ ను సాధించింది. టీమిండియా ఓడిన తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ భారత క్రికెట్ అభిమానుల కోసం హిందీలో ఒక ట్వీట్ చేశారు. మా టీమ్‌తో జాగ్రత్త అని ముందే వార్నింగ్ ఇచ్చాను గుర్తుందా? అని పీటర్సన్ హిందీలో ట్వీట్ చేశాడు.
ఆస్ట్రేలియాపై టీమిండియా 2-1తో టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత కెవిన్ పీటర్సన్ ఓ ట్వీట్ చేస్తూ 'ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన టెస్ట్ సిరీస్ అద్భుతం. అయితే మరీ అంతగా సంబరాలు చేసుకోకండి. రెండు వారాల్లో అసలైన టీమ్ వస్తోంది జాగ్రత్త' అని అన్నాడు. అది కూడా జనవరి నెలలో పీటర్సన్ ట్వీట్ చేశాడు. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగానే.. హిందీలో ట్వీట్ చేశాడు. 'ఆస్ట్రేలియా సిరీస్ విజయం సాధించినప్పుడే హెచ్చరించా. భారత్ ఎక్కువగా సంబరాలు చేసుకోవద్దని. అదే నిజం అయింది ఇప్పుడు' అని అన్నాడు. భారత్ అభిమానులు మాత్ర ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్ లు ఉన్నాయిలే అంటూ భారతజట్టుకు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు.
భారత్ గత సిరీస్‌ల్లో తొలి మ్యాచ్ కోల్పోయినప్పటికీ సిరీస్ లను గెలిచిందని గుర్తు చేస్తున్నారు. ఆసీస్ టూర్‌ను ఇలాగే ఓటమితో ప్రారంభించిన టీమిండియా తర్వాత సిరీస్‌ను గెలిచింది. అంతకముందు స్వదేశంలోనూ తొలి టెస్టు మ్యాచ్ ఓడి ఆ తర్వాత సిరీస్‌ను సొంతం చేసుకున్న ఘనత మన టీమిండియాకు ఉందని అభిమానులు పీటర్సన్ కు సమాధానం చెబుతూ ఉన్నారు.