మనం మ్యాచ్ గెలిచాం.. తను హృదయాలను గెలిచాడు..!
India Won Third One Day Against England. ఇక మ్యాచ్ లోకి వస్తే..ఉత్కంఠభరితంగా చివరి వన్డేలో ఎట్టకేలకు భారత్ జయకేతనం ఎగురవేసింది
By Medi Samrat Published on 29 March 2021 1:46 AM GMTరాజా ది గ్రేట్.. మాస్ మహారాజ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రఘుబాబు చెప్పినట్టు వాళ్లు మ్యాచ్ గెలిస్తే.. మనం హృదయాలను గెలిచాం డైలాగ్ గుర్తుంది కదా.. సరిగ్గా అలాగే జరిగింది నిన్నటి ఫైనల్‌లో.. ఇంగ్లాండ్ ఓపెనర్లు త్వరగా అవుటయ్యారు.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లలో కూడా ఒకరిద్దరూ మినహా ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఇక భారత్‌కు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు అంతా.. కానీ అనుకున్నవన్నీ జరిగితే అది క్రికెట్ ఎందుకు అవుద్ది. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ.. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుండి బ్యాట్ ఝలిపించి.. లక్ష్యం దగ్గరి వరకూ తీసుకొచ్చాడు సామ్ కర్రాన్. నిజంగా 22 ఏళ్ల ఈ యువ ఆల్‌రౌండర్ ఏ మాత్రం బెరుకు లేకుండా ఆడిన ఇన్నింగ్సు క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంది. అందుకే మనం మ్యాచ్ గెలిస్తే.. సామ్ కర్రాన్ హృదయాలను గెలిచాడు.
ఇక మ్యాచ్ లోకి వస్తే..ఉత్కంఠభరితంగా చివరి వన్డేలో ఎట్టకేలకు భారత్ జయకేతనం ఎగురవేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ (83 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 95 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో టీమిండియాకు ఓటమి భయాన్ని చూపాడు. కానీ భారత బౌలర్లు చివరి వరకు పోరాడి జట్టును గెలిపించారు.
ఆదివారం జరిగిన సిరీస్ ఫలితం తేచ్చే చివరిదైన మూడో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్‌లలో రిషభ్ పంత్ (78), ధవన్ (67), హార్దిక్ (64) అర్ధసెంచరీలు చేసి బ్యాటింగ్‌లో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్‌కు మూడు, రషీద్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఆ తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసి ఓడింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లలో ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు విఫలమవగా.. సామ్ కర్రాన్ (83 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 95 నాటౌట్), మలాన్ (50) లు రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్‌కు నాలుగు, భువనేశ్వర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా సామ్ కర్రాన్.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా బెయిర్‌స్టో నిలిచారు.