కరోనా విరామం తరువాత ఆడిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం లఖ్‌నవూ వేదికగా అటల్ బిహారి వాజ్‌పేయీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 177 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ మిథాలి రాజ్ (85 బంతుల్లో 50; 4 ఫోర్లు, సిక్స్), వైస్ కెప్టెన్ హర్మాన్‌ప్రీత్‌కౌర్ (41 బంతుల్లో 40; 6 ఫోర్లు) లు మాత్రమే రాణించారు. దీప్తి శర్మ (27), మంధాన (14)లు దారుణంగా విఫలం అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇస్మెయిల్ 3, మ్లాబా 2, కాప్, ఖాకా, లస్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.
178 లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 40.1 ఓవర్లలో చేదించింది. ఓపెనర్లు లిజెల్ లీ (122 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్), లారా వాల్వా(110 బంతుల్లో 80; 12 ఫోర్లు) తొలి వికెట్‌కు 169 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. భారత బౌలర్లలో జులన్ గోస్వామి రెండు వికెట్లు పడగొట్టింది. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ తరువాత భారత మహిళల జట్టు బరిలోకి దిగిన మ్యాచ్ ఇదే. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 9 (మంగళవారం) జరుగనుంది.