లార్డ్స్‌లో సంచలన విజయం.. అద్భుతం చేసిన బుమ్రా, షమి
India win Lords Test.కోహ్లీసేన లార్డ్స్‌లో సంచలన విజయం సాధించింది. ఎవరూ కూడా ఊహించని విధంగా
By తోట వంశీ కుమార్ Published on 17 Aug 2021 3:02 AM GMTకోహ్లీసేన లార్డ్స్‌లో సంచలన విజయం సాధించింది. ఎవరూ కూడా ఊహించని విధంగా పుంజుకుని ఓటమి నుంచి తప్పించుకుని గెలుపొందిన తీరు అద్భుతం. టెస్టు మ్యాచ్‌లో అసలు సిసలు మజా అంటే ఏంటో ఈ మ్యాచ్ ద్వారా మరోసారి నిరూపితమైంది. ఒక్కొ సెషన్‌లో ఒక్కొ జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. చివరి రోజు టీమ్ఇండియా నభూతో న భవిష్యత్ అన్న విధంగా ఆడింది. ఈ విజయాన్ని మాటల్లో కూడా వర్ణించలేము. ఫలితంగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
బ్యాట్‌తో మెరిసిన షమి, బుమ్రా..
ఆఖరి రోజు డ్రానే లక్ష్యంగా ప్రతికూల పరిస్థితుల్లో ఓవర్ నైట్ స్కోర్ 181/6 తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించింది భారత్. రిషబ్ పంత్ ఒక్కడే స్పెషలిస్టు బ్యాట్స్‌మన్. అతడు పెవిలియన్ చేరితే.. జట్టు ఐదో పదో పరుగులకు కూలిపోవచ్చనే సందేహం. ఇంగ్లాండ్ కూడా త్వరగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ గెలవాలనే ఆరాటంలో ఉంది. అందుకు తగ్గట్లుగానే పంత్(22)ను త్వరగా పెవిలియన్ చేర్చింది. అప్పటికి జట్టు స్కోర్ 194 పరుగులు మాత్రమే.
కొద్ది సేపటికే ఇషాంత్ (16) కూడా ఔటైయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే. ఆధిక్యం 182 పరుగులు మాత్రమే. ఆ దశలో మిగిలిన రెండు వికెట్లు పడితే.. ఇంగ్లాండ్ విజయం సాధించడం ఖాయం. అయితే.. అప్పుడే అద్భుతం జరిగింది. కష్టాల్లో ఉన్న భారత్‌ను షమీ (70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) ఆదుకున్నారు. ఎవరూ ఊహించని స్కోర్ అందించారు. 9వ వికెట్‌కు అభేధ్యంగా 89 పరుగులు జోడించారు. భారత్‌కు ఓటమి ప్రమాదాన్ని తప్పించడమే కాకుండా గెలుపు కోసం ప్రయత్నించే అవకాశం కల్పించారు. రెండో ఇన్నింగ్స్‌ను 109.3 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది
ఇంగ్లాండ్ విలవిల..
272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించారు భారత పేసర్లు. డ్రా కోసమే ఆడాల్సిన స్థితిలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా.. దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. స్కోర్ బోర్డుపై రెండు పరుగులు కూడా చేరకుండానే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ మూడో బంతికి బుమ్రా.. బర్న్స్ ను వెనక్కి పంపగా.. రెండో ఓవర్‌లో షమి.. సిబ్లీని పెవిలియన్‌కు చేర్చారు. వీరిద్దరు కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేదు. వీళ్లిద్దరికి తోడుగా ఇషాంత్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. హమీద్ (9), బెయిర్ స్టో (2)ల పనిపట్టాడు. కెప్టెన్ రూట్ (60 బంతుల్లో 33; 5 ఫోర్లు) జట్టును కాపాడాలనుకున్నా బుమ్రా ఆ అవకాశం అతనికి ఇవ్వలేదు.
కానీ బట్లర్(96 బంతుల్లో 25; 3 ఫోర్లు) , మెయిన్ అలీ(13) తో కలిసి పోరాడాడు. ఇద్దరూ ఎంతో సహనంగా బ్యాటింగ్ చేస్తూ ఓవర్లు కరిగిస్తూపోయారు. దీంతో మ్యాచ్ డ్రా అవుతుందని ఇంగ్లాండ్ శిబిరంలో ఆశలు చెలరేగాయి. ఈ దశలో సిరాజ్.. వరుస బంతుల్లో మెయిన్ అలీ, సామ్ కరన్‌లను ఔట్ చేశాడు. తరువాత రిబిన్సన్(35 బంతుల్లో 9) సహకారంతో బట్లర్ డ్రా కోసం గట్టిగానే ప్రయత్నించాడు. ఈ దశలో బుమ్రా రాబిన్సన్‌ను ఓ స్లో బాల్‌తో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం మరోసారి సిరాజ్ అద్భుతం చేశాడు. బట్లర్, అండర్సన్‌ను ఔట్ చేసి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.