ఫిబ్రవరి 6, శుక్రవారం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్.. పురుషుల అండర్-19 క్రికెట్‌లో ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. వైభవ్ సూర్యవంశీ 175 పరుగుల అద్భుతమైన స్కోరుతో, ఆయుష్ మాత్రే నేతృత్వంలోని జట్టు మొదట 9 వికెట్లకు 411 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌ను 311 పరుగులకు ఆలౌట్ చేసి టోర్నమెంట్ చరిత్రలో అత్యంత బలమైన టైటిల్ విజయాలలో ఒకటిగా నిలిచింది.
412 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 311 రన్స్‌కు ఆలౌట్ అయింది. 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా.. ఫాల్క్‌నర్ సెంచరీతో మెరిశారు. డాక్సిన్ (66), మేయెస్ (45) రాణించారు. భారత బౌలర్లలో అంబరీశ్ 3, దేవేంద్రన్, చౌహాన్ తలో 2 వికెట్లు తీశారు. యువ భారత్‌కు రికార్డు స్థాయిలో ఇది ఆరో అండర్ 19 వరల్డ్ కప్ ట్రోఫీ కావడం గమనార్హం.
అంతకుముందు భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఏకంగా 411 పరుగులు చేసింది. సంచలన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశారు. ఆయుష్ మాత్రే (53), కుందు (40), కనిష్క్ (37*), త్రివేది (32), మల్హోత్రా (30) రాణించారు. ఇంగ్లండ్‌లో మింటో 3, మోర్గాన్, గ్రీన్ తలో 2 వికెట్లు తీశారు.