కరోనా మహమ్మారి కారణంగా భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీసులు వాయిదా పడ్డాయి. తాజాగా శ్రీలంక జట్టులో మరో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడమే అందుకు కారణం. దీంతో ఆ జట్టులోని ఆటగాళ్లు మరికొన్నాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది. జులై 13 నుంచి ప్రారంభం కావాల్సిన వన్డే మ్యాచులను 17 నుంచి, .జులై 21 నుంచి జరగాల్సిన టీ20 సిరీస్‌ను 24 కు రీ షెడ్యూల్ చేశారు.
అవును, సిరీస్ జులై 13కు బదులుగా జులై 17 నుంచి మొదలుకానుంది. ప్లేయర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం' అని బీసీసీఐ అధికారి తెలిపారు. ఇప్పటికే ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంటీ ఫ్లవర్‌కు గురువారం పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో శుక్రవారం ఆటగాళ్లందరికి మరోసారి పరీక్షలు నిర్వహించగా.. డేటా అనలిస్టు నిరోషన్‌కు పాజటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఆటగాళ్లను ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించారు.
లంక పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 13,16,18 తేదీల్లో వన్డేలు.. 21,23,25 తేదీల్లో టీ20లు ఆడాల్సి ఉంది. కాగా.. రీషెడ్యూల్ ప్రకారం 17,19,21 తేదీల్లో వన్డేలు, 24, 25, 27 తేదీల్లో టీ20లు జరగనున్నాయి.