ఇక టీ20 సమరం.. పటిష్ఠంగా భారత్.. ఆత్మవిశ్వాసంతో లంక
India VS Sri lanka 1ST T20 Today.వన్డే సమరం ముగిసింది. ఇక ఇప్పుడు టి20ల సమరం ప్రారంభం కానుంది.
By తోట వంశీ కుమార్ Published on 25 July 2021 11:18 AM ISTవన్డే సమరం ముగిసింది. ఇక ఇప్పుడు టి20ల సమరం ప్రారంభం కానుంది. వన్డేల్లో ఓ మోస్తరుగా పోటినిచ్చిన లంక జట్టు.. టీ20ల్లో భారత్‌కు షాకివ్వాలని బావిస్తుండగా.. టీ20 ప్రపంచ కప్ ముందు భారత్ జట్టు ఆడే చివరి సిరీస్ ఇదే కావడంతో పలు ప్రశ్నలకు సమాధానం కనుకొనే ప్రయత్నం చేయనుంది టీమ్ఇండియా. ఇప్పటికే ఆటగాళ్లను ఆడించే విషయంలో కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి చెప్పినట్లు నడుచుకుంటామని సారథి శిఖర్ ధావన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు టీ20ల సిరీస్‌లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని కుర్రాళ్లు ఆరాటపడుతున్నారు.
ఓపెనర్లుగా శిఖర్ ధావన్, పృథ్వీ షా బరిలోకి దిగనుండగా.. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ జట్టులోకి రానున్నాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌లో దారుణంగా విఫలం అయిన మనీష్ పాండే స్థానంలో సంజు శాంసన్‌కు ఆడే అవకాశం ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్, హర్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు చోటు ఖాయం. చివరి వన్డేలో విశ్రాంతి తీసుకున్న భువనేశ్వర్, దీపక్‌చహర్ మళ్లీ జట్టులోకి రానున్నారు. స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, రాహుల్ చహర్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ తో సత్తాచాటి.. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్‌లో తన మిస్టరీ బంతులతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డ వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో అరంగేట్రం చేయకుండానే ఇంటిబాట పట్టాడు. అతడికి శ్రీలంక పర్యటన రూపంలో మరో అవకాశం లభించింది. టి20 ప్రపంచకప్‌కు ఎంతో సమయం లేకపోవడంతో 29 ఏళ్ల వరుణ్‌ను పరీక్షించేందుకు ఇదే సరైన సమయం. దాంతో అతడికి తొలి టి20లో చాన్స్ దొరికే అవకాశం ఉంది.
ఆత్మవిశ్వాసంతో లంక..
తొలి రెండు వన్డేల్లో ఓడిన శ్రీలంక.. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది. సొంతగడ్డపై భారత్ చేతిలో 10 ఓటముల తర్వాత గెలుపొందింది. ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంలో తొలి టీ20 బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌కు దూరమైన హసరంగా ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలున్నాయి. హసరంగా జట్టులోకి వస్తే జయవిక్రమార్క్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. టీ20 స్పెషలిస్ట్ అయిన ఇసురు ఉడానాకు కూడా చోటు దక్కే అవకాశాలున్నాయి. మూడో వన్డేలో ఆల్‌రౌండ్ షో కనబర్చిన ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో టీ20 సిరీస్‌కు సన్నద్దమైంది.