రాణించేది ఎవ‌రో..? లంక‌తో భార‌త్ తొలి వ‌న్డే నేడు

India vs Sri lanka 1st ODI match today.టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో చోటు ఆశిస్తున్న వాళ్లంద‌రూ శ్రీలంక సిరీస్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2021 10:04 AM IST
రాణించేది ఎవ‌రో..?  లంక‌తో భార‌త్ తొలి వ‌న్డే నేడు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో చోటు ఆశిస్తున్న వాళ్లంద‌రూ శ్రీలంక సిరీస్‌లో రాణించేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భార‌త జ‌ట్టు ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ కోసం ఓ ప‌క్క క‌స‌రత్తులు చేస్తుంటే.. ధావ‌న్ నాయ‌క‌త్వంలోని భార‌త కుర్రాళ్ల జ‌ట్టు లంక‌ను జ‌యించేందుకు రెడీ అయ్యారు. ఈ సిరీస్ లో స‌త్తా చాటి సెల‌క్ట‌ర్ల దృష్టిలో ప‌డి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటు ద‌క్కించుకోవాల‌ని ఇషాన్ కిష‌న్‌, సంజు శాంస‌న్‌, పృథ్వీ షా, ప‌డిక్క‌ల్ వంటి కుర్రాళ్ల‌తో పాటు సీనియ‌ర్లు ధావ‌న్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్ లు సైతం ఆరాట‌ప‌డుతున్నారు.

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్‌, లంక మధ్య తొలి వన్డే జరుగనుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నాం 3 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ ప్లేయ‌ర్లు ఆడ‌కున్నా.. రాహుల్‌ ద్రవిడ్‌ కోచింగ్‌లో ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లతో టీమ్‌ఇండియా పటిష్ఠంగా కనిపిస్తుంటే.. నిబంధనల ఉల్లంఘన, కరోనా కేసులు, గాయాల బెడద ఇలా లంక జట్టు సమస్యలతో సతమతమవుతున్నది. విజ‌య్ హ‌జారే ట్రోఫీలో టాప్ స్కోర‌ర్ అయిన పృథ్వీ షా.. ధావ‌న్‌తో క‌లిసి ఓపెనింగ్ చేయ‌డం లాంచ‌న‌మే.

సీనియ‌ర్ ఆట‌గాళ్లు హార్థిక్ పాండ్య‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, తుది జ‌ట్టులో ఉండ‌డం ఖాయం. అయితే.. మూడో స్థానంలో ఆడే అవ‌కాశం రుతురాజ్‌, ప‌డిక్క‌ల్‌ల‌లో ఎవ‌రికి ద‌క్కుతుంది..? సూర్య‌కుమార్ యాద‌వ్‌, మ‌నీష్ పాండేల‌లో ఆడేదెవ‌రు..? కృనాల్ పాండ్య‌ను కాద‌ని కృష్ణ‌ప్ప గౌత‌మ్‌ను తీసుకుంటారా..? ఇషాన్ కిష‌న్‌, సంజు శాంస‌న్‌ల‌లో ఎవ‌రు వికెట్ కీపింగ్ చేస్తారు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంది. వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ చాహర్‌ కూడా జట్టులో ప్లేస్‌ కోసం పోటీ పడుతున్నారు. ఇక భువనేశ్వర్‌తో పాటు సైనీ, దీపక్‌ చాహర్‌లలో ఒకరు పేస్‌ విభాగాన్ని నడిపించనున్నారు. అరంగ్రేటం చేయాల్సిన ఆట‌గాళ్లు ఆరుగురు ఉన్నారు. మ‌రి వారిలో ఎంత మంది ఈ సిరీస్‌లో అరంగ్రేటం చేస్తారో చూడాలి. ఇక అంద‌రికి అవ‌కాశం క‌ల్పించ‌లేమ‌ని కోచ్ ద్రావిడ్ ఇప్ప‌టికే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఏ జ‌ట్టుతో భార‌త్ ఆడిన‌ప్ప‌టికి కూడా.. లంక జ‌ట్టుకు క‌ష్టాలు త‌ప్ప‌వు.

Next Story