IND Vs SA: టెస్టు సిరీస్ గెలవడానికి సిద్ధంగా ఉన్నాం: రోహిత్

భారత్‌ ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌లో ఉంది. ఇప్పటికే మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడేసింది.

By Srikanth Gundamalla  Published on  25 Dec 2023 5:30 PM IST
india vs south africa, test match, rohit sharma ,

IND Vs SA: టెస్టు సిరీస్ గెలవడానికి సిద్ధంగా ఉన్నాం: రోహిత్

భారత్‌ ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌లో ఉంది. ఇప్పటికే మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడేసింది. అయితే.. టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్‌ వర్షార్పణం కావడం.. ఆ తర్వాత రెండింటిలో చెరో మ్యాచ్‌ గెలవడంతో టీ20 సిరీస్ సమం అయ్యింది. ఇక వన్డే సిరీస్‌ను మాత్రం టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇప్పుడు టీమిండియా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు సిద్ధం అవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 26వ తేదీ నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం అవుతుంది.

ఈ బాక్సింగ్‌ డే టెస్టు కోసం ఇరు జట్లు ఎంతగానో శ్రమించాయి. సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత భారత జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడారు. దక్షిణాఫ్రికా పిచ్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

దక్షిణాఫ్రికా పిచ్‌లపై బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. సఫారీ పిచ్‌లు ఎక్కువగా పేసర్లకు అనుకూలంగా ఉంటాయని చెప్పాడు. బౌన్స్‌ ఎక్కువగా ఉండే వికెట్‌పై ఫాస్ట్‌ బౌలర్లు తమ ఆధిపత్యం చెలాయిస్తారనీ.. మ్యాచ్‌ జరుగుతున్న కొద్ది పిచ్‌పై పగుల్లు వచ్చి బ్యాటర్లు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పాడు. అయితే.. టెస్టు మ్యాచ్‌ జరిగే ఐదు రోజులు పిచ్‌ ఒకేలా ఉంటుందనీ.. బంతి బౌన్స్‌ అవుతూనే ఉంటుందని రోహిత్‌ పేర్కొన్నాడు. మ్యాచ్‌లో ప్రతిరోజూ బౌలర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు ఒక చాలెంజ్‌ అన్నాడు. అయితే.. ఈ పిచ్‌లపై తమకు గతంలో అనుభవం ఉందనీ.. ప్రస్తుతం జట్టులో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రొటీస్‌ క్వాలిటీ బౌలింగ్‌ ఎటాక్‌పై పైచేయి సాధించడం అంత ఈజీ కాదని రోహిత్‌ అన్నాడు.

కానీ.. క్లిష్ట పరిస్థితుల్లోనే అద్బుతమైన పోరాట పటిమను చూపించి విజయం సాధిస్తే చాలా సంతోషంగా ఉంటుందని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. టెస్టు మ్యాచ్‌లో ఎలా విజయానికి చేరువ అవ్వాలి.. ఎలా ఆటను కొనసాగించాలనే దానిపై ఇప్పటికే తాము చర్చించుకున్నట్లు చెప్పాడు. మ్యాచ్‌లో విజయం సాధించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

Next Story