టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరిగే గ్రౌండ్ రికార్డులు ఎవ‌రికి అనుకూలంగా ఉన్నాయో తెలుసా.?

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శనివారం జరిగే ఫైనల్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో దక్షిణాఫ్రికా ఫైనల్‌ ఆడడం ఇది మూడోసారి

By Medi Samrat  Published on  28 Jun 2024 1:00 PM GMT
టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరిగే గ్రౌండ్ రికార్డులు ఎవ‌రికి అనుకూలంగా ఉన్నాయో తెలుసా.?

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శనివారం జరిగే ఫైనల్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో దక్షిణాఫ్రికా ఫైనల్‌ ఆడడం ఇది మూడోసారి. భార‌త్ ఇంతకు ముందు 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో టైటిల్‌ గెలిచింది. అదే సమయంలో 2014 ప్రపంచకప్‌లో టైటిల్ మ్యాచ్‌లో శ్రీలంకతో పోటీ ప‌డింది. ఇప్పుడు శనివారం బార్బడోస్‌లో మ‌రోమారు టీ20 ప్రపంచకప్ ఆడ‌నుంది.

2024 T20 ప్రపంచ కప్‌లో బార్బడోస్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగాయి? ఈ మైదానంలో టాస్‌ రికార్డు ఎవరికి అనుకూలంగా ఉంది? ఈ టోర్నమెంట్‌లో బార్బడోస్‌లో గరిష్ట, కనిష్ట స్కోర్లు ఏమిటి? ఇక్కడ భారత్‌దే పైచేయి ఎందుకు? ఇలాంటి వివ‌రాలు తెలుసుకుందాం.

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ మ్యాచ్‌ బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరగనుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఈ మైదానంలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా.. అందులో మూడు మ్యాచ్‌లు సూపర్‌ఎయిట్‌లో ఉన్నాయి. ఇక్కడ ఎనిమిది మ్యాచ్‌లలో ఒకటి ఫలితం తేల‌లేదు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టు అత్యధిక స్కోరు 201 పరుగులు చేసింది. ఏడు మ్యాచ్‌లలో నాలుగు సార్లు టాస్ గెలిచిన జట్టు విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడిపోయిన జ‌ట్టు మూడు మ్యాచ్‌ల‌లో గెలిచాయి, ఇందులో భారత్ కూడా ఉంది.

ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత జట్టు బార్బడోస్‌లో ఒక మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో భార‌త్ గెలిచింది. ఇక‌ దక్షిణాఫ్రికా జట్టు బార్బడోస్‌లో ఆడటం ఇదే మొదటిసారి. దీంతో పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడం వారికి సవాలుగా మార‌నుంది. త‌ద్వారా భారత్‌కు గతంలో ఆడిన‌ అనుభవం ఇక్క‌డ క‌లిసిరానుంది.

గ్రౌండ్ ఓవ‌రాల్ రికార్డుల‌ గురించి చెప్పాలంటే.. దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఇక్కడ మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడింది. మూడింటిలో రెండు గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2010 టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఈ మూడు మ్యాచ్‌లను ఆడింది. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్‌లపై విజయాలు సాధించింది. ఇంగ్లండ్‌పై ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

భారత్ విష‌యానికొస్తే.. భారత జట్టు కూడా ఇక్కడ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండింటిలో ఓటమి చవిచూసింది. ఒకదానిలో విజయం సాధించింది. 2010 ప్రపంచకప్‌లో భారత జట్టు రెండు పరాజయాలను చవిచూసింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో భారత జట్టు ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్‌లు సూపర్-8కి చెందినవే. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో విజయం సాధించింది. బార్బడోస్ మైదానంలో గ‌త‌ చరిత్ర దక్షిణాఫ్రికాకు క‌లిసిరాగా.. ప్రస్తుత ఫామ్, అనుభవం మాత్రం భారత జట్టుకు అనుకూలంగా ఉంది.

Next Story