భారత్ vs పాక్ పోరు: పాకిస్థాన్ 'మిస్టరీ' స్పిన్నర్‌కు.. మన వరుణ్ చక్రవర్తి చెక్ పెడతాడా?
టీ20 వరల్డ్ కప్‌లో ఆదివారం జరగనున్న హై-వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. మైదానం బయట ఎంత హడావుడి ఉన్నా...
By - అంజి |
భారత్ vs పాక్ పోరు: పాకిస్థాన్ 'మిస్టరీ' స్పిన్నర్‌కు.. మన వరుణ్ చక్రవర్తి చెక్ పెడతాడా?
టీ20 వరల్డ్ కప్‌లో ఆదివారం జరగనున్న హై-వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. మైదానం బయట ఎంత హడావుడి ఉన్నా, ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన పేరు 'ఉస్మాన్ తారిఖ్'. పాకిస్థాన్ స్పిన్నర్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్, ఆ విచిత్రమైన పాజ్ (విరామం) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, హడావుడి లేకుండా వికెట్లతో సమాధానం చెబుతున్న టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రూపంలో పాకిస్థాన్‌కు అసలైన ముప్పు పొంచి ఉంది. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి వరుణ్ చక్రవర్తి వెనక్కి తిరిగి చూడలేదు.
జస్ప్రీత్ బుమ్రా ప్రధాన అస్త్రం కావొచ్చు కానీ, స్పిన్‌కు అనుకూలించే కొలంబో పిచ్‌పై వరుణ్ అత్యంత కీలకం కానున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో యూఎస్ఏపై (1/24), నమీబియాపై (3/7) అద్భుత ప్రదర్శనతో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్ బ్యాటర్లు వరుణ్ బౌలింగ్‌లో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. గత నాలుగు మ్యాచ్‌ల్లో అతను 7 ఎకానమీతో మూడు వికెట్లు తీశాడు. 2021 దుబాయ్ మ్యాచ్ పక్కన పెడితే, 2025 ఆసియా కప్‌లో పాక్ బ్యాటర్లను వరుణ్ ముప్పుతిప్పలు పెట్టాడు. ఫఖర్ జమాన్ వంటి కీలక వికెట్లను తీసి పాక్ పతనాన్ని శాసించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా వరుణ్ రికార్డు సృష్టించాడు.
వరుణ్ ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లు ఆడగా.. 61 వికెట్లు తీశాడు. గత 15 ఇన్నింగ్స్‌లుగా ప్రతి మ్యాచ్‌లో కనీసం ఒక వికెట్ తీస్తూ తన నిలకడను చాటుకుంటున్నాడు. 50 వికెట్ల మైలురాయిని దాటిన ఏకైక స్పిన్నర్ కూడా ఇతనే. పాక్ ఓపెనర్లు సయీమ్ అయూబ్, సాహిబ్‌జాదా ఫర్హాన్ దూకుడుగా ఆడినా.. మిడిల్ ఓవర్లలో వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం వారికి సవాలే. ఆదివారం జరిగే ఈ పోరులో భారత్ గెలిస్తే సూపర్-8 బెర్తు దాదాపు ఖాయమవుతుంది. సూర్యకుమార్ యాదవ్ నమ్ముకున్న 'ట్రంప్ కార్డ్' వరుణ్ చక్రవర్తి మళ్ళీ మ్యాజిక్ చేస్తాడో లేదో చూడాలి.