ఉప్పల్ లో మ్యాచ్.. వారికి ఫ్రీ ఎంట్రీ

భారత్ – ఇంగ్లండ్‌ మధ్య జనవరి 25 నుంచి మొదలవనున్న తొలి టెస్టులో

By Medi Samrat  Published on  20 Jan 2024 4:10 PM GMT
ఉప్పల్ లో మ్యాచ్.. వారికి ఫ్రీ ఎంట్రీ

భారత్ – ఇంగ్లండ్‌ మధ్య జనవరి 25 నుంచి మొదలవనున్న తొలి టెస్టులో విద్యార్థులతో పాటు ఆర్మీ జవాన్లకు ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించే అవకాశం కల్పించినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు శనివారం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మ్యాచ్‌ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మ్యాచ్‌ను ఉచితంగా చూపించాలని నిర్ణయించామని.. మ్యాచ్‌ చూడాలనుకునే స్కూల్ నుంచి లెటర్‌ అందితేనే వారిని స్టేడియంలోకి ఉచితంగా ఆట చూసేందుకు అనుమతిస్తామన్నారు. ఒక స్కూల్‌కు ఒక్క రోజు మాత్రమే అవకాశముంటుందని తెలిపారు. పాఠశాల విద్యార్థులతో పాటు దేశ సేవ చేస్తున్న ఆర్మీ, నేవి అధికారులకు ఈ టెస్టు మ్యాచ్‌ను చూపించాలని నిర్ణయం తీసుకున్నట్టు జగన్‌మోహన్‌ రావు తెలిపారు. ఆర్మీ జవాన్‌లతో పాటు వారి కుటుంబసభ్యులకూ మ్యాచ్‌ చూసేందుకు అనుమతిస్తామని అన్నారు. ఇందుకు ఆసక్తిగలవారు సంబంధిత విభాగాధిపతితో సంతకం చేయించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ మ్యాచ్‌ కోసం ఇదివరకే 26 వేల దాకా టికెట్లను విక్రయించినట్టు జగన్‌మోహన్‌ రావు చెప్పారు.

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టుకు ఉప్పల్‌ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. జనవరి 25 నుంచి 29 వరకు ఈ మ్యాచ్‌ జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ జరగనుంది.


Next Story