ఖాళీ స్టేడియాల్లోనే తొలి రెండు టెస్టులు
India vs England First Two Tests in Chennai to be Played Behind Closed Doors.కరోనా మహమ్మారి కారణంగా చాలా విరామం
By తోట వంశీ కుమార్ Published on 23 Jan 2021 4:35 PM IST
కరోనా మహమ్మారి కారణంగా చాలా విరామం తరువాత టీమ్ఇండియా స్వదేశంలో మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో పరిమితంగా ప్రేక్షకులను అనుమతి ఇవ్వడంతో.. భారత్‌లో కూడా 50శాతం ప్రేక్షకులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని భావించారు. అయితే.. కరోనా పరిస్థితుల కారణంగా ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించొద్దని బీసీసీఐ తమకు ఆదేశాలు జారీ చేసిందని తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) కార్యదర్శి ఆర్‌ఎస్ రామసామి తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వచ్చే నెలలో ఆరంభమయ్యే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఆటగాళ్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా చూడాలనే.. బీసీసీఐ నిర్ణయం మేరకు ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. మ్యాచ్‌లు జరిగే సమయంలో మీడియా ప్రతినిధులను కూడా అనుమతించొద్దని చెప్పిందన్నారు. వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సిరీస్‌ని బయో-బబుల్ వాతావరణంలో బీసీసీఐ నిర్వహిస్తుండగా.. స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతిస్తే రిస్క్ అని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో 50000 సీటింగ్ సామర్థ్యం ఉన్న చెపాక్ స్టేడియం ఖాళీగా దర్శనమివ్వనుంది.
ఈనెల 27న భారత్, ఇంగ్లాండ్ జట్లు చెన్నైకి చేరుకుని బయో బబుల్‌లో ఉంటాయి. తొలి టెస్టు ఫిబ్రవరి 5 ఆరంభం కానుంది. ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలి రెండు టెస్టులు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుండగా.. మూడు, నాలుగు టెస్టులు అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరగనున్నాయి.