మరో సిరీస్‌పై కన్నేసిన భారత్.. వెస్టిండీస్‌తో రెండో వన్డే నేడే
India Tour of West Indies 2022 Today 2nd ODI.అదే వేదిక.. అదే ప్రత్యర్థి.. మూడు రోజుల వ్యవధిలో విండీస్‌తో రెండో
By తోట వంశీ కుమార్ Published on 24 July 2022 3:05 AM GMTఅదే వేదిక.. అదే ప్రత్యర్థి.. మూడు రోజుల వ్యవధిలో విండీస్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమ్ఇండియా సిద్ధమైంది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డేలో ఒత్తిడిని అధిగమించి విజయం సాధించిన టీమ్ఇండియా నేటి మ్యాచ్‌లోనూ విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకోవాలని భావిస్తోంది. సొంతగడ్డపై కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్‌కు సిరీస్ అప్పగించిన వెస్టిండీస్ మరో సిరీస్ కోల్పోరాదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంది.
చాలా కాలం తరువాత తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ ఫామ్ అందుకోగా, 19 నెలల విరామం అనంతరం ఆడిన తొలి వన్డేలోనే శుభ్‌మన్ గిల్ సత్తాచాటడంతో ఓపెనింగ్ విభాగంలో భారత్‌కు ఎలాంటి సమస్య లేదు. ఇక జట్టులో చోటు ప్రశ్నార్థమైన సమయంలో శ్రేయాస్ అర్థశతకంతో రాణించి ఆకట్టుకున్నాడు. వీరు మరోసారి చెలరేగాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. అయితే.. తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించాల్సి ఉన్నప్పటికీ మిడిలార్డల్ వైఫల్యం కొంప ముంచింది. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్‌లు రాణిస్తే విండీస్‌కు మరోసారి కష్టాలు తప్పదు. అటు బౌలింగ్‌లో సిరాజ్ చక్కగా రాణించి వన్డేలకూ తాను తగినవాడినన్ని నిరూపించుకున్నాడు. శార్దూల్, చాహల్‌తో పాటు మిగతా బౌలర్లు విండీస్‌ను ఎంత తక్కువకు కట్టడి చేస్తే అంత మంచిది.
తొలి వన్డేలో దాదాపు గెలిచినంత పని చేసిన విండీస్ ఈ సారి విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. గత ఏడు వన్డే మ్యాచ్‌ల్లో ఆ జట్టు పరాజయం పాలైంది. దీంతో పరాజయాల పరంపరకు తెర దించాలని బావిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ పూరన్‌తో పాటు షై హోప్స్, మేయర్స్, కింగ్స్, బ్రూక్స్ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక తొలి వన్డేలో మొదటగా పిచ్ బ్యాటింగ్‌కు సహకరించింది. అయితే.. బంతి కాస్త పాతబడ్డాక పరుగులు కష్టంగా వచ్చాయి. చేధనలోనూ బ్యాటర్లు పరుగులు రాబట్టారు. ఈ రోజు కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఒకవేళ పిచ్ కాస్త నెమ్మదిస్తే బౌలర్లు ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది.