కౌంట్ డౌన్ స్టార్ట్‌.. కోచ్‌గా తొలి టెస్టు సిరీస్‌ను నెగ్గించుకునేందుకు ఆట‌గాళ్ల‌కు గంభీర్ పాఠాలు

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం టీమిండియా శుక్రవారం చెన్నై చేరుకుంది

By Medi Samrat  Published on  13 Sept 2024 3:51 PM IST
కౌంట్ డౌన్ స్టార్ట్‌.. కోచ్‌గా తొలి టెస్టు సిరీస్‌ను నెగ్గించుకునేందుకు ఆట‌గాళ్ల‌కు గంభీర్ పాఠాలు

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం టీమిండియా శుక్రవారం చెన్నై చేరుకుంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌లకు ఇది మొదటి టెస్ట్ సిరీస్. ఇందులో భారత జట్టును గెలిపించడమే వారి లక్ష్యం. ఈ క్ర‌మంలోనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) భారత ఆటగాళ్లకు సంబంధించిన కొన్ని ఫోటోల‌ను ట్విట‌ర్‌లో షేర్ చేసింది, అందులో గంభీర్-రోహిత్‌ జ‌ట్టు స‌భ్యుల‌తో మాట్లాడ‌టం చూడొచ్చు.

భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్ ఎం చిదంబరం స్టేడియంలో జరగనుండగా.. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో ప్రారంభం కానుంది. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన చిత్రాలను బీసీసీఐ షేర్ చేసింది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఉత్కంఠభరితమైన సీజ‌న్ కోసం టీమ్ ఇండియా సన్నాహాలు ప్రారంభించిందని బీసీసీఐ పేర్కొంది.

స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా జట్టులోకి వచ్చాడు. కోహ్లీ లండన్ నుంచి నేరుగా చెన్నై చేరుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా చెన్నైకు చేరుకున్నారు. ఒక నెల కంటే ఎక్కువ విరామం తర్వాత ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి వచ్చారు. ఆగస్టులో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. కొత్త కోచ్ గౌతం గంభీర్‌కి ఇది తొలి టెస్టు సిరీస్.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ టెస్టు సిరీస్ జరగనుంది. దీని తర్వాత.. భారత జట్టు న్యూజిలాండ్‌లో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాలో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 68.52 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 62.52 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 45.83 శాతం మార్కులతో నాలుగో స్థానంలో ఉంది.

బంగ్లాదేశ్ ఇటీవలే పాకిస్థాన్‌ను ఓడించింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో నజ్ముల్ హుస్సేన్ శాంటో నేతృత్వంలో టీమ్‌ ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసింది. రావల్పిండి వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ 0-2 తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు భారత్‌పై కూడా అలాంటి ప్రదర్శనపైనే జట్టు కన్నేసింది.

Next Story